
టాటా, ఎయిర్ బస్ తో గుజరాత్ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. టాటా, ఎయిర్ బస్ లు సైన్యం కోసం రవాణా విమానాలను తయారుచేస్తాయి. వీటితో రూ.22వేల కోట్ల ఒప్పందాన్ని గుజరాత్ ప్రభుత్వం కుదుర్చుకుంది. దేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేయడం ఇదే మొదటి ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.21,935 కోట్లు. ఈ విమానాన్ని పౌర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు.
ఇందుకు సంబంధించిన తయారీ కర్మాగారాన్ని వడోదరలో ఈనెల 30న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశం రానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే (సెప్టెంబరులో) వేదాంత లిమిటెడ్ తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ యొక్క జాయింట్ వెంచర్ ద్వారా... చిప్స్ ఉత్పత్తి చేయబడే 19.5-బిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందేందుకు మహరాష్ట్రతో గుజరాత్ ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన ప్లాంట్లను అహ్మదాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల లక్ష మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం.
ఎయిర్‌బస్ నుంచి మొత్తం 56 రవాణా విమానాల కొనుగోలుకు కేంద్రం గత నెలలో ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్‌లో భాగంగా 16 విమానాలు ఫ్లై అవే కండిషన్‌లో డెలివరీ చేయనున్నారు. కాగా.. భారత్ లో మరో 40 విమానాలను తయారు చేయనున్నారు. మొదటి 16 ఫ్లై-అవే విమానాలు సెప్టెంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్ లో మొదటిసారి తయారుచేయబడే విమానం సెప్టెంబర్ 2026 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త C-295 రవాణా విమానం భారత వైమానిక దళానికి చెందిన.. వృద్ధాప్య అవ్రో విమానం స్థానంలో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ విమానం IAF యొక్క లాజిస్టిక్ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని ఓ ప్రకటనలో రక్షణశాఖ పేర్కొంది.