ప్రాణం మీదకు తెచ్చిన ఫైర్ హెయిర్ కట్

ప్రాణం మీదకు తెచ్చిన ఫైర్ హెయిర్ కట్

ఈ మధ్యకాలంలో యువత సరికొత్త హెయిర్ స్టైల్స్ ను ఫాలో కావడం ట్రెండింగ్ గా మారింది. అందరికంటే భిన్నంగా కనిపించడానికే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరు జుట్టు ఊడకుండా ఉండటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. కొందరు ఉన్న జుట్టు పై ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ హెయిర్ కట్ అనేది బాగా వినిపిస్తున్న పేరు. అయితే ఇది చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా చూశాం. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే గుజరాత్ లోని వాపి పట్టణంలో చోటుచేసుకుంది. 

వాపిలోని భడక్‌మోరా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. ‘ఫైర్‌ హెయిర్‌కట్‌’ కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఓ సెలూన్ కు వెళ్లి హెయిర్‌కట్‌లో భాగంగా అతని జుత్తుకు మంట అంటించారు. అది కాస్త వికటించి.. ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో అతడు లబోదిబోమని కొట్టుకున్నాడు. అక్కడున్న  సెలూన్ నిర్వాహకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగో అలా మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. అప్పటికే అతని తల, మెడ, ఛాతి పై తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే సూరత్ లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సెలూన్‌ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫైర్‌ హెయిర్‌కట్ కోసం జుత్తుకు పూసిన రసాయనం కారణంగా ఇలా జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.