ఏఐలో దళిత నిరుద్యోగులకుట్రైనింగ్ ఇవ్వండి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కు : ఎమ్మెల్యే జిగ్నేష్

ఏఐలో దళిత నిరుద్యోగులకుట్రైనింగ్ ఇవ్వండి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కు : ఎమ్మెల్యే జిగ్నేష్
  • గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్  సూచన 

హైదరాబాద్, వెలుగు: సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై దళిత నిరుద్యోగ యువతకు ట్రైనింగ్  ఇవ్వాలని గుజరాత్  కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్  మేవాని.. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ కు సూచించారు.  సోమవారం డీఎస్ఎస్ భవన్ లో ఎస్సీ కార్పొరేషన్  చైర్మన్  ప్రీతం, హైదరాబాద్  కాంగ్రెస్  నేత సుదీష్ కుమార్  ఆధ్వర్యంలో వంద మంది మేధావులతో మీటింగ్  జరిగింది. రాష్ర్టంలో దళితుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ ల వివరాలను జిగ్నేష్ కు ప్రీతం వివరించారు.

రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్  చేపట్టాల్సిన అంశాలపై జిగ్నేష్  పలు సూచనలు చేశారు. గతంలో డేటా ఎంట్రీ, టైలరింగ్ కోర్సులకు ఎస్సీ కార్పొరేషన్ ట్రైనింగ్  ఇచ్చేదని ప్రీతమ్  తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దళితులు అన్ని రంగాల్లో అభివృధ్ది చెందాలని, మార్కెట్ లో వస్తున్న కొత్త కోర్సులపై ట్రైనింగ్ ఇవ్వాలని జిగ్నేష్  సూచించారు. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి దళితులకు ఇవ్వాలన్నారు.  అనంతరం ఎస్సీ వెల్ఫేర్  సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ ను జిగ్నేష్, ప్రీతం కలిసి మీటింగ్  అంశాలను వివరించారు.