ఐపీఎల్ 2026 క్లైమాక్స్ కు చేరుకుంటున్న వేళ పాయింట్ల పట్టికలో సమీకరణాలు మారిపోయాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్లి ప్లేఆఫ్స్ రేసులో తన ఆధిపత్యాన్ని గుజరాత్ చాటుకుంది.
కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ:
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే చుక్కలు కనిపించాయి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటింగ్ వెన్నెముకను విరిచారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్‌ను గోల్డెన్ డకౌట్ చేయడమే కాకుండా, ఆ ఓవర్‌ను మెయిడిన్ చేసి సన్‌రైజర్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు సిరాజ్.
ఇక కగిసో రబాడా తన స్పెల్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు కీలకమైన ఇషాన్ కిషన్, స్మరన్ రవిచంద్రన్ (9) వికెట్లను పడగొట్టి హైదరాబాద్ ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో కేవలం 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
మిడిలార్డర్ విలవిల.. హోల్డర్ హవా:
టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. సలీల్ ఆరోరా (16)ని ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ పంపగా.. జేసన్ హోల్డర్ తన అనుభవంతో హెన్రిచ్ క్లాసెన్ (14), నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్‌లను వరుసగా అవుట్ చేసి హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19) కొన్ని భారీ షాట్లు ఆడినా, అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే సరిపోయింది. చివరకు హైదరాబాద్ జట్టు కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈ భారీ విజయం గుజరాత్ టైటాన్స్‌కు కేవలం 2 పాయింట్లే కాకుండా, నెట్ రన్ రేట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 16 పాయింట్లతో గుజరాత్ టేబుల్ టాపర్‌గా నిలవగా, హైదరాబాద్‌కు ఈ ఓటమి ప్లేఆఫ్స్ అవకాశాలపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంది.
గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ తలో 3 వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ కృష్ణ రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
You say Impact 🗣️
— IndianPremierLeague (@IPL) May 12, 2026
We hear Jason Holder 😎
It's all #GT at the moment in Ahmedabad 🙌
Updates ▶️ https://t.co/o2tKKCeEaH#TATAIPL | #KhelBindaas | #GTvSRH | @gujarat_titans pic.twitter.com/x4uU3Z0VB8
