వీడియో వైరల్: సింగర్ ఊర్వశిపై నోట్ల వర్షం

వీడియో వైరల్: సింగర్ ఊర్వశిపై నోట్ల వర్షం

గుజరాత్‌లో ఓ సింగర్ పై నోట్ల వర్షం కురిసింది. ఓ సంప్రదాయ వేడుకలో పాల్గొన్న ఊర్వశి రాడాడియాపై అభిమానులు కరెన్సీ నోట్లు వర్షం కురిపించారు. ‘క్వీన్‌ ఆఫ్ గుజరాతీ ఫోక్‌’గా పాపులర్‌‌ అయిన ఆమె.. అహ్మదాబాద్‌లో జరిగిన ‘తులసీ కల్యాణం’ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊర్వశి రాడాడియా తన బృందంతో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఆమె హార్మోనియం వాయిస్తూ పాట పాడుతుండగా ఆ వేడుకకు హాజరైన వారు బాక్సుల్లో నోట్లు తీసుకొచ్చి ఊర్వశిపై గుమ్మరించారు. ఓ దశలో ఆమె హార్మోనియం వాయించడానికి కూడా వీలు లేనంతగా దానిపై కరెన్సీ నోట్లు నిండిపోవడంతో వాటిని చేత్తో తోసేసి ఆమె తన సంగీత కచేరీ కొనసాగించారు.

నవంబర్ 15న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేశారు. వెలకట్టలేని ప్రేమ (Invaluable Love) అన్న క్యాప్షన్‌తో ఆమె ఆ వీడియోను షేర్ చేసుకున్నారు. ఊర్వశిపై డబ్బుల వర్షం కురిసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత డబ్బు మీరేం చేసుకుంటారంటూ అభిమానుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఈ ధన వర్షం కురవడానికి కారణం మీ వాయిస్‌లో ఉన్న మ్యాజిక్‌ అని మరికొందరు పొగడ్తలతో ముంచెత్తారు.