జేఈఈ మెయిన్ లో గురుకుల స్టూడెంట్ల సత్తా

జేఈఈ మెయిన్ లో గురుకుల స్టూడెంట్ల సత్తా
  •     బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు మంచి పర్సంటైల్
  •     సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల అభినందనలు 
  •     బీసీ గురుకులాల్లో ఐదుగురికి 90కిపైగా పర్సంటైల్
  •     28 మందికి 80కి పైనే పర్సంటైల్

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్  పరీక్షల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో చదవుతున్న విద్యార్థులు  ఇటీవల రిలీజ్  అయిన పరీక్షల ఫలితాల్లో ఉత్తమ పర్సంటైల్  సాధించారని ఆయా సొసైటీలు ప్రకటించాయి. అత్యుత్తమ పర్సంటైల్  సాధించిన స్టూడెంట్స్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ, వెల్ఫేర్  మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్  అభినందనలు  తెలిపారు. 

దేశవ్యాప్తంగా మొదటి విడతలో జరిగిన జేఈఈ  మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకులాల నుంచి 318 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో ఐదుగురు విద్యార్థులు 90 కంటే ఎక్కువ పర్సంటైల్  సాధించగా, మరో 28 మంది విద్యార్థులు 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించారని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు. గర్ల్స్ కేటగిరిలో  ఎ.నిత్య 92.19 , సీహెచ్  గాయత్రి  91.50, ఎం.సహస్ర 87.69, పి.చరిత 86.20, ఎం.స్నేహ 85.09 పర్సంటైల్  సాధించారు. బాయ్స్  కేటగిరీలో  ఎం.నరేందర్ 91.58, ఆర్.కౌశిక్ 91.25,  బి.మల్లేష్ 90.50, బి.హరీశ్ 89.19, డి.రోహన్ 88.05 పర్సంటైల్ సాధించారని వివరించారు. 

గతంలో రెండు సీఓఈలలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు కోచింగ్  ఇస్తుండగా,  తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పది సీఓఈలను ఏర్పాటు చేయడమే కాకుండా లాంగ్ టర్మ్  కోచింగ్  కూడా  ఇస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడించారు.  ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీ పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించారని, రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని  మంత్రి ఆకాంక్షించారు. 

ఎస్సీ గురుకులాల్లో 8 మందికి 90కి పైగా పర్సంటైల్

జేఈఈ మెయిన్–2026 మొదటి విడత పరీక్షల్లో ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 8 మంది 90పైగా పర్సంటైల్  సాధించినట్లు సెక్రటరీ  కృష్ణ ఆదిత్య తెలిపారు. గౌలిదొడ్డి సీఓఈ కళాశాల నుంచి వై.నవదీప్  98.39 పర్సంటైల్‌‌‌‌తో అగ్రస్థానంలో నిలువగా, సత్య స్వరూప్ 97.99, యశ్వంత్ 95.70, ఎం. మహేష్ 95.18, ఎస్. రాజు 94.83 పర్సంటైల్‌‌  సాధించారు. అదేవిధంగా గౌలిదొడ్డి బాలికల సీఓఈ నుంచి కె. శ్రీవర్ష 94.64, వి.మంజుల 92.25 పర్సంటైల్‌‌  సాధించారని ఆయన వెల్లడించారు. సీఓఈ కేంద్రాల నుంచి మొత్తం 26 మంది విద్యార్థులు 90 పర్సంటైల్‌‌, 109 మంది విద్యార్థులు 80 పర్సంటైల్‌‌, 236 మంది విద్యార్థులు 70కు పైగా పర్సంటైల్‌‌  సాధించారని సెక్రటరీ పేర్కొన్నారు. 

గత సంవత్సరం కటాఫ్‌‌ను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా 337 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌‌డ్–2026 పరీక్షకు అర్హత సాధించనున్నారని ఆయన తెలిపారు. ఉత్తమ పర్సంటైల్ సాధించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ లు అభినందనలు తెలిపారు. రాబోయే జేఈఈ మెయిన్ రెండో విడత నీట్,  జేఈఈ అడ్వాన్స్‌‌డ్  వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇస్తున్నామని సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. 

ఇక దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షలో ఎస్టీ గురుకుల విద్యార్థులు,  తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (టీజీఈఎంఆర్ ఎస్ ) అత్యుత్తమ పర్సంటైల్  సాధించారని సెక్రటరీ సీతాలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం కంటే మెరుగైన పర్సంటైల్‌‌  సాధించి కార్పొరేట్  కోచింగ్  సెంటర్లకు దీటుగా తమ ప్రతిభను మరోసారి నిరూపించారని చెప్పారు. రెండు సంస్థల నుంచి మొత్తం 462 మంది విద్యార్థులు  గత ఏడాది కటాఫ్  ఆధారంగా  అర్హత సాధించారన్నారు. ఐదుగురికి  90 పర్సంటైల్, 27 మందికి 80కిపైనే, 27 మందికి 70 కిపైనే పర్సంటైల్  సాధించారని వివరించారు.