ఏపీ నేతలు షటిల్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు బంద్‌‌‌‌ చేయాలి : శాసనమండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌ రెడ్డి

ఏపీ నేతలు షటిల్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు బంద్‌‌‌‌ చేయాలి : శాసనమండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌ రెడ్డి
  •     తెలంగాణలో ఉంటాం.. ఏపీని పాలిస్తాం అంటే కుదరదు
  •     శాసనమండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి

నల్గొండ, వెలుగు : ‘తెలంగాణంలో ఉంటాం.. ఏపీని పాలిస్తాం అంటే కుదరదు, అమరావతి బ్రహ్మాండం అని మాటల్లో చెబితే సరిపోదు.. అది నిజం కావాలంటే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం సహా అధికారులంతా అక్కడే ఉండాలి’ అని శాసనమండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో మీడియా చిట్‌‌‌‌చాట్‌‌‌‌లో మాట్లాడారు. ఏపీ నేతలు షటిల్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు బంద్‌‌‌‌ చేసి, వెంటనే అమరావతికి వెళ్లిపోవాలని, అప్పుడే రాజధానికి గుర్తింపు, అభివృద్ధి సాధ్యం అవుతాయన్నారు. తెలంగాణ ప్రజలకు ఓపిక చాలా ఎక్కువని, సహనం దాటితే మాత్రం ఏ శక్తీ ఆపలేదన్నారు. ప్రజల ఓపిక నశించడం వల్లే గతంలో తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తు చేశారు. కేసీఆర్‌‌‌‌తో పాటు ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌‌‌‌ ఎంపీలుగా తామంతా ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవడం వల్లే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. 

గతంలో బీజేపీ సైతం ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసి, సుష్మాస్వరాజ్ వంటి నేతలు మద్దతు ఇచ్చారని.. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ విభజనపై అసహనం వ్యక్తం చేయడం సరికాదన్నారు. నాయకులు మారినంత మాత్రాన జాతీయ పార్టీ విధానాలు మారకూడదన్నారు. వడ్ల సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని, బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ కోటా పెంచాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డిలు కేంద్రమంత్రిని కలిసినా ఆశించిన స్థాయిలో స్పందన లేదన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మిల్లర్లు రూ.1400లకే వడ్లు కొంటున్నప్పటికీ.. రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు అప్పు చేసి మరీ మద్దతు ధర చెల్లిస్తోందని చెప్పారు. రైతులు కేవలం వరి, పత్తి పైనే ఆధారపడకుండా పప్పుధాన్యాల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు.