చార్మినార్‌‌‌‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ ఫాస్ట్ దాడి

చార్మినార్‌‌‌‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ ఫాస్ట్ దాడి
  • 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల ఆయిల్ సీజ్ ఇద్దరు నిర్వాహకుల అరెస్ట్
  • కూకట్‌‌‌‌పల్లి బ్రౌన్ బేర్ బేకరీ కిచెన్‌‌‌‌లో బొద్దింకలు.. షోకాజ్ నోటీసులు జారీ

చార్మినార్/కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. చార్మినార్ లాడ్ బజార్ ఏరియాలోని ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్ ఫాస్ట్) ఆకస్మిక దాడి చేసింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో, ప్రమాదకరమైన కెమికల్ రంగులతో ఇక్కడ ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 15 లీటర్ల చొప్పున ఉన్న 6 టిన్నుల వంట నూనెను టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్, హుస్సేనీ ఆలం ఇన్‌‌‌‌స్పెక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు ఎండీ. అక్బర్, సయ్యద్ అలీలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

కూకట్​పల్లి బ్రౌన్​ బేకరీకి షోకాజ్​ నోటీసులు

మరోవైపు, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని ప్రముఖ బేకరీ ‘బ్రౌన్ బేర్ (బేక్ మ్యాక్స్ ఫుడ్స్)’ పై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ బేకరీ కిచెన్‌‌‌‌‌‌‌‌లో అడుగడుగునా ఆహార భద్రతా లోపాలు, తీవ్ర అపరిశుభ్రత బయటపడ్డాయి. వంటగది నిండా బొద్దింకలు తిరుగుతుండటం, ఓపెన్ డ్రైనేజీ ఉన్న ప్రాంతంలోనే కేకులు, ఇతర తినుబండారాలు తయారు చేస్తుండటం చూసి అధికారులు షాకయ్యారు. కేకుల తయారీ కోసం సిద్ధం చేసిన కోడిగుడ్ల సొనను ఈగలు ముసిరేలా వదిలేశారని, సరుకుల బాక్సుల్లో పావురాలు గూళ్లు కట్టుకున్నాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, ప్యాకెట్లపై తయారీ, ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ డేట్స్ కూడా ముద్రించలేదు. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన నిర్వాహకులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు పంపించారు.