V6 News

డ్రగ్స్ కట్టడికి హెచ్- న్యూ విస్తరణ..ఐదు ప్రత్యేక విభాగాలుగా ఏర్పాటు : టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

డ్రగ్స్ కట్టడికి హెచ్- న్యూ విస్తరణ..ఐదు ప్రత్యేక విభాగాలుగా ఏర్పాటు : టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

బషీర్​బాగ్, వెలుగు: నగరంలో​డ్రగ్స్ కట్టడికి పోలీస్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్ (హెచ్​– న్యూ)ను ప్రస్తుతం ఉన్న రెండు బృందాల నుంచి ఐదు ప్రత్యేక విభాగాలకు విస్తరించినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. గురువారం రాజేంద్రనగర్​లో ఏర్పాటు చేసిన హెచ్​– న్యూ కొత్త కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ విభాగం డ్రగ్స్ నెట్​వర్క్​లపై దాడులు, వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంచుతుందని స్పష్టం చేశారు. 

ముఖ్యంగా ‘టీమ్-14’ పేరుతో ఇన్​స్పెక్టర్లు శ్రీకాంత్, నాగార్జున్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని వివరించారు. లోతైన విచారణల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడటమే ఈ విభాగాం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కీలక కేసులను ఛేదించిన హెచ్​– న్యూ.. తాజా విస్తరణతో డ్రగ్స్ మాఫియాకు గట్టి హెచ్చరిక జారీ చేస్తోందని ఆయన వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ జాడ లేకుండా చేసేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.