
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న మనోళ్లకు అక్కడి కోర్టు ఊరట కలిగించే తీర్పు ఇచ్చింది. హెచ్1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న వారి స్పౌస్ (భార్య లేదా భర్త) కూడా పనిచేసుకోవచ్చని చెప్పింది. ట్రంప్ సర్కారు పెట్టిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఈ వ్యవహారంలో ఫైనల్ జడ్జిమెంట్ఇచ్చేదాకా ఒబామా హయాంలో తీసుకొచ్చిన పాలసీనే కొనసాగించాలని ఆదేశించింది. దీంతో హెచ్4 వీసాతో అమెరికా వెళ్లిన వారికి చట్టబద్ధంగా పనిచేసుకునే అవకాశం లభించింది. అమెరికాలోని హెచ్1 బీ వీసా హోల్డర్లలో మనోళ్ల సంఖ్యే ఎక్కువ. కోర్టు తాజా ఆదేశాలతో వారి లైఫ్ పార్ట్నర్లు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలిగింది.
హెచ్ 1 బీ వీసా..
అమెరికన్ కంపెనీలు విదేశాలకు చెందిన నిపుణులకు ఉద్యోగమివ్వడానికి హెచ్ 1 బీ వీసా తప్పనిసరి. ఈ వీసాతో అమెరికా చేరిన వారిని నాన్ ఇమిగ్రెంట్లుగా పరిగణిస్తారు. ఉద్యోగంచేస్తూ, వీసా పర్మిట్‌ను పొడిగించుకుంటూ, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తుంటారు. వీరు తమ లైఫ్ పార్ట్నర్ను అమెరికాకు పిలిపించుకునే అవకాశం ఉంది. హెచ్ 1 బీ వీసా హోల్డర్ల లైఫ్ పార్టనర్‌కు అమెరికా హెచ్ 4 వీసాలు జారీచేస్తుంది. ఈ వీసా హోల్డర్లకు ఉద్యోగంచేసే అవకాశం మాత్రంలేదు. గ్రీన్ కార్డ్ వచ్చాకే పనిచేసే వీలుండేది. ఒబామా సర్కారు దీనిని మార్చేసింది. హెచ్ 4 వీసా హోల్డర్లకూ వర్క్ పర్మిట్ మంజూరు చేసింది. ఈ పాలసీతో అమెరికాలో ఉంటున్న ఇండియన్లు.. ముఖ్యంగా వేలాది మంది మహిళలు సంతోషించారు. ట్రంప్ అధికారం చేపట్టాక ఈ పాలసీని రద్దు చేశారు.
అమెరికన్ల ఆందోళన
హెచ్4 వీసా హోల్డర్లకు వర్క్ పర్మిట్ ఇవ్వడంపై అమెరికన్లు ఆందోళనలు చేశారు. ‘సేవ్స్ జాబ్స్యూఎస్ఏ’ సహా అమెరికాలోని పలు సంస్థలు కోర్టుకెక్కాయి. స్థానికులకు ఉపాధి పోతోందని ఆరోపించాయి. ఈ పాలసీ వల్ల తాము ఉద్యోగాలు కోల్పోయామని పలువురు అమెరికన్లు కోర్టుకు వెళ్లారు. హెచ్4 వీసా హోల్డర్లకు వర్క్ పర్మిట్ ఇవ్వడం వల్ల హెచ్1 బీ నియామకాలు జరిపేందుకు కంపెనీలకు మరింత అవకాశం కలుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం జవాబిస్తూ.. గ్రీన్ కార్డ్అప్లికేషన్ ప్రాసెస్‌కు చాలా సమయం పడుతోందని, దీనివల్ల వారి పార్ట్ నర్లు వ్యక్తిగత, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. చట్టబద్ధంగా దేశంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఆటంకం కలిగిస్తుందని పేర్కొంది. ఈ వివాదంలో డిస్ట్రిక్ కోర్టు వెలువరించిన తీర్పును యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్ సమీక్షించింది. తీర్పును పున:పరిశీలించాలని ఆదేశిస్తూ.. హెచ్ 4 వీసా హోల్డర్లకు వర్క్ పర్మిట్విషయంలో ఆంక్షలను టెంపరరీగా ఎత్తివేసింది.