
బషీర్ బాగ్, వెలుగు : కొరియర్ లో డ్రగ్స్ రవాణా అవుతున్నాయంటూ యువకుని నుంచి సైబర్ నేరగాళ్లు రూ. లక్షా 60 వేలు లాగారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం... నగరానికి చెందిన 26 ఏళ్ల ప్రేవేట్ ఉద్యోగికి ముంబై కస్టమ్స్ అధికారి పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. అతని పేరుపై ముంబై నుంచి చైనా కు ఓ కొరియర్ పార్సెల్స్ వెళ్తున్నాయని వాటిలో ఏటీఎం కార్డ్స్ , పాస్ పోర్ట్స్ , ల్యాప్ టాప్ తో పాటు డ్రగ్స్ ఉన్నట్లు వివరించారు.
ముంబై పోలీసుల క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలని అందుకోసం స్కైప్ వీడియో కాల్ లో వారితో సంప్రదించాలని సూచించారు. అనంతరం పోలీస్ అధికారి యూనిఫామ్ తో బాధితుడికి సైబర్ చీటర్స్ వీడియో కాల్ చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నావంటూ , అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు బెదిరించారు. ఈ కేసును సీబీఐ విచారిస్తుందని, రుజువైతే పడే శిక్షను వివరించారు.
కేసు నుంచి బయటపడాలంటే రూ.1.60 లక్షలను పంపాలని చెప్పడంతో బాధితుడు పంపించాడు. వారం రోజులు గడిచినా వారి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
క్రెడిట్ కార్డ్ ఓచర్ పేరుతో 1.66 లక్షల చీటింగ్
క్రెడిట్ కార్డ్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ కు చెందిన 40 ఏండ్ల వ్యక్తిని చీట్ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం... నగరానికి చెందిన 40 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి ఇండస్ లాండ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో ఫోన్ చేశారు. బాధితుడు వాడుతున్న క్రెడిట్ కార్డ్ పై బోనస్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని వాడుకుంటే షాపింగ్ లో డిస్కౌంట్ వస్తుందని తెలిపారు.
అతని కార్డు చివరి నాలుగు అంకెలు తెలపడంతో.. నిజమని బాధితుడు నమ్మాడు. ఆ పాయింట్స్ అతని కార్డుకు యాడ్ అవ్వాలంటే... కార్డు డిటైల్స్ తెలపాలని కోరారు. వారు కోరినట్లు కార్డ్ నెంబర్ , ఎక్స్పైరీ డేట్ , సీవీవీ వెల్లడించారు. స్కామర్లు కాల్ కట్ చేసిన కొద్దిసేపటికి , బాధితుడు అతడి క్రెడిట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అతని కార్డు నుంచి రూ.1,66,000 డబ్బులు కట్ అయినట్లు నిర్దారించుకున్నాడు. వెంటనే ఇండస్ లాండ్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి రిపోర్ట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.