- కంపెనీల నెట్‌వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ సిస్టమ్‌పై సైబర్ దాడులు
- ఆర్థిక లావాదేవీల డేటాను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
- అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సూచన
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరితీశారు. చార్టర్డ్ అకౌంటెన్సీలు, కన్సల్టింగ్ సంస్థలు విస్తృతంగా వినియోగించే నెట్‌వర్క్ అటాచ్డ్ స్టోరేజ్(ఎన్‌ఏఎస్) పరికరాలే లక్ష్యంగా రాన్సమ్‌వేర్ దాడులు చేస్తున్నట్లు నేషనల్ సైబర్ క్రైం థ్రెట్ అనలిటిక్ యూనిట్ వెల్లడించింది. ఇలాంటి దాడులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఇందులో భాగంగానే కార్పొరేట్ కంపెనీలకు ఇటీవల కేంద్ర హోంశాఖ పలు సూచనలు చేసింది. చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థలు, కన్సల్టింగ్ సంస్థల ఎన్‌ఏఎస్‌లపై దాడులు పెరిగినట్టు వెల్లడించింది. రాన్సమ్‌వేర్ అటాక్స్ ద్వారా ఎన్‌ఏఎస్ పరికరాలను హ్యాక్ చేసి డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడం, రహస్య డేటాను దొంగిలించడం, డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది.
దొంగిలించిన డేటా ఆధారంగా డబ్బులు డిమాండ్
ఎన్‌ఏఎస్ కంపెనీల సెంట్రల్ స్టోరేజ్ సిస్టం వ్యవస్థ సంబంధిత సంస్థల్లోని ఇంటర్నల్ నెట్‌వర్క్‌కు కనెక్టెడ్‌గా ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వినియోగదారుల ముఖ్యమైన ఫైళ్లను స్టోర్ చేస్తుంటారు. చార్టెడ్ అకౌంటెన్సీలు, కన్సెల్టెన్సీల వద్ద కంపెనీల ఆర్థికలావాదేవీలతో కూడి రహస్య డేటాను ఎన్‌ఏఎస్‌లో నిక్షిప్తం చేస్తారు. ఇలాంటి ముఖ్యమైన డేటాను హ్యాక్ చేసి మొత్తం స్టోరేజ్ వ్యవస్థను ఎన్‌క్రిప్ట్ చేస్తునట్టు తేలింది.
దొంగిలించిన డేటా ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఆయా సంస్థలను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి సైబర్ నేరాలకు గురికాకుండా పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నేషనల్ సైబర్ క్రైం థ్రెట్ అనలిటిక్ యూనిట్ సూచించింది.
సైబర్ అటాక్స్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
- ఎన్‌ఏఎస్‌ను ఇంటర్నెట్‌కు ఎక్స్‌పోజ్ చేయకుండా, సాధ్యమైనంతవరకు యాక్సెస్‌ను పరిమితం చేయాలి
- పటిష్టమైన పాస్‌వర్డ్‌లు, మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి
- ఎన్‌ఏఎస్ ఫర్మ్‌వేర్, సెక్యూరిటీ ప్యాచ్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి
- డేటాకు సురక్షితమైన ఆఫ్‌లైన్ లేదా ఎయిర్-గ్యాప్ బ్యాకప్‌లు నిర్వహించాలి
- సైబర్ మోసం లేదా హ్యాకింగ్ జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే 1930, www.cybercrime.gov.inలోఫిర్యాదు చేయాలి.
