మీ డాడీ దగ్గరికి పరిగెత్తడం తప్ప మీకు మరో దారి లేదు: ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఫైర్

మీ డాడీ దగ్గరికి పరిగెత్తడం తప్ప మీకు మరో దారి లేదు: ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఫైర్

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలను తానే కాపాడానని.. కానీ అతడు కృతజ్ఞత లేనివాడు అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ఈ మేరకు ట్రంప్ కామెంట్స్‎కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చి ఘాటుగా బదులిచ్చారు. ఇరాన్‎తో అణు ఒప్పందం కోరుకోవడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిజాయితీపరుడైతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ పట్ల అగౌరవకరమైన, ఆమోదయోగ్యం కాని స్వరాన్ని పక్కన పెట్టాలని చురకలంటించారు. 

లక్షలాది మంది ఖమేనీ మద్దతుదారులను ట్రంప్ బాధపెట్టడం మానేయాలని సూచించారు. ఇరాన్ క్షిపణుల ధాటికి కకావికలమైన ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వాళ్ల డాడీ (అమెరికా) దగ్గరకు పరిగెత్తడం తప్ప వేరే మార్గం లేదని సెటైర్ వేశారు.  బెదిరింపులు, దాడులకు భయపడమని ప్రపంచానికి చాటి చెప్పిన శక్తివంతమైన ఇరానియన్ ప్రజలు ఎవరి దగ్గరి నుంచి సానుభూతి, ప్రాణ బిక్ష కోరుకోరని పేర్కొన్నారు. 

అంతకుముందు ట్రంప్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని తానే కాపాడానని.. కానీ అతడు కనీసం కృతజ్ఞత చూపించలేదని విమర్శించాడు. ఖమేనీ కృతజ్ఞత లేని వాడని అభివర్ణించారు. ‘‘అతను ఎక్కడ ఆశ్రయం పొందాడో నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్ లేదా అమెరికా సాయుధ దళాలు తల్చుకుంటే అతన్ని మట్టుబెడతాయి. కానీ మేం ఆ పని చేయలనుకోవడం లేదు. అతనిని చాలా భయంకరమైన మరణం నుంచి కాపాడాను. ఇందుకు అతను నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో ఖమేనీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలకు పై విధంగా ఇరాన్ విదేశాంగ మంత్రి కౌంటర్ ఇచ్చాడు.