
ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే అప్పట్లో నరేంద్ర మోడీకి మాట సాయం చేయకపోయి ఉంటే, ఆయన ఈ స్థాయికి చేరుకునే వారు కాదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే అన్నారు. సోమవారం ముంబైలో జరిగిన నార్త్ ఇండియన్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 – 30 ఏండ్లుగా రాజకీయ నాయకత్వాన్ని శివసేన కాపాడిందని, అయితే, బీజేపీ వాళ్లు మాత్రం తమ పార్టీని, అకాలీదళ్‌ను వద్దనుకున్నారని చెప్పారు. తాను బీజేపీతో తెగతెంపులు చేసుకున్నానని, కానీ హిందుత్వాన్ని ఎప్పుడూ విడిచి పెట్టలేదన్నారు. బీజేపీది హిందుత్వం కాదని అన్నారు. మోడీకి బాల్ థాక్రే చేసిన మాట సాయాన్ని గుర్తుకుచేస్తూ, ‘‘మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ రాజధర్మాన్ని గౌరవించాలని కోరినప్పుడు మోడీని కాపాడింది బాల్ థాక్రేనే. ఆ రోజు ఆయన సాయం చేయకపోతే.. ఈ రోజు మోడీ ఈ స్థాయికి చేరుకునేవారు కాదు” అని ఉద్దవ్ థాక్రే ఆరోపించారు.