ఇజ్రాయెల్​లో నరమేధం

ఇజ్రాయెల్​లో నరమేధం
  • ఇజ్రాయెల్​లో  నరమేధం
  • ఇంటింటికి తిరుగుతూ హమాస్ మిలిటెంట్ల కాల్పులు
  • మ్యూజిక్ ఫెస్టివల్​పై దాడి.. విదేశీయుల కిడ్నాప్   
  • తోబుట్టువులు, తల్లిదండ్రుల ముందే అమ్మాయి ఉరితీత  
  • జర్మన్ యువతిని చంపి నగ్నంగా ఊరేగింపు 
  • రెండో రోజూ మిలిటెంట్లు, ఇజ్రాయెల్​ బలగాల మధ్య కొనసాగిన పోరు 
  • ఇజ్రాయెల్​లో 600 మంది, గాజా స్ట్రిప్​లో 400 మంది మృతి 

జెరూసలెం : ఇజ్రాయెల్​లో రెండో రోజూ హమాస్ మిలిటెంట్ల నరమేధం కొనసాగింది. శనివారం వేలాది రాకెట్లతో మెరుపుదాడులు చేసి దేశంలోకి చొరబడిన వందలాది మంది మిలిటెంట్లు ఆదివారం కూడా విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా కాల్పులు జరిపారు. వీధుల్లో కనిపించిన జనంపై, వెహికల్స్ పైనా ఫైరింగ్ చేశారు. ప్రధానంగా మహిళలు, పిల్లలు, విదేశీయులపై దాడులు చేసి, వందలాది మందిని బందీలుగా పట్టుకెళ్లారు.

హమాస్ మిలిటెంట్లను ఏరివేస్తున్నామని, పదుల కొద్దీ మిలిటెంట్లను బందీలుగా పట్టుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. వందలాది మంది టెర్రరిస్ట్ లు దేశంలోకి చొరబడ్డారని.. ఇంటింటికీ వెళ్తూ ప్రజలను ఊచకోత కోశారని వెల్లడించింది. ఇజ్రాయెల్ గడ్డపై ఇంకా వందలాది మంది మిలిటెంట్లు ఉన్నారని, వారితో పోరాటం కొనసాగుతోందని పేర్కొంది. ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్/స్టార్మ్’ పేరుతో రెండ్రోజులుగా హమాస్ మిలిటెంట్లు దాడులు చేస్తుండగా.. ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్’ పేరుతో ఇజ్రాయెల్ బలగాలు గాజా స్ట్రిప్​లోని టార్గెట్లపై భీకరంగా ప్రతిదాడులు కొనసాగిస్తున్నాయి. 

రెండో రోజూ భీకర పోరు.. 

ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లకు మధ్య రెండో రోజూ భీకర పోరాటం కొనసాగింది. గాజా స్ట్రిప్ నుంచి దక్షిణ ఇజ్రాయెల్​లోని వివిధ పట్టణాలకు మరింతమంది ఫైటర్లను, వెపన్లను పంపామని హమాస్ ప్రకటించింది. దాదాపు 22 చోట్ల మిలిటెంట్లతో తమ సైన్యం పోరాడుతోందని ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజాలోని వతన్ టవర్, అల్ అక్లౌక్ టవర్, మతర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఓ మసీదు నేలమట్టం అయ్యాయి. గాజా స్ట్రిప్ కు సరిహద్దుల్లో ఇజ్రాయెల్​లో ఉన్న ఒఫాకిమ్, సెడార్ట్, యాద్ మోర్డెచాయి, కఫర్ అజా, బీరీ, యాతిద్, కిసుఫిమ్ ఏరియాల్లో మిలిటెంట్లు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య కాల్పులు కొనసాగాయి.

రెండ్రోజుల్లో రెండు వైపులా దాడుల్లో మరణించిన వారి సంఖ్య 1000 దాటింది. ఇజ్రాయెల్​లోని వివిధ ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్ల కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 600కు పెరిగింది. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.  సుమారు 100కుపైగా సోల్జర్లు, ప్రజలను బందీలుగా పట్టుకుని గాజా స్ట్రిప్​లోకి తరలించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 400 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 1,700 మంది గాయపడ్డారని గాజా అధికారులు వెల్లడించారు. 

ఉత్తరాదిన హిబ్జొల్లా దాడులు..

ఇజ్రాయెల్ పై దక్షిణం వైపున గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్ దాడులు, గన్ ఫైరింగ్​తో దాడులకు తెగబడుతుండగా.. ఉత్తరం వైపున లెబనాన్ నుంచి హిజ్బొల్లా టెర్రరిస్ట్ సంస్థ సైతం ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ పోస్ట్​లపై రాకెట్ దాడులు ప్రారంభించింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్​లోని హిజ్బొల్లా క్యాంపులపై డ్రోన్ దాడులు చేసింది. హిజ్బొల్లాకు ఇరాన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. 

గాజాలో చీకట్లు

గాజా స్ట్రిప్​కు ఇజ్రాయెల్​ కరెంట్ సప్లై కట్ చేసింది. దీంతో గాజాలోని చాలా ఏరియాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఆ ప్రాంతానికి సరుకులు, ఇతర నిత్యావసరాల వంటివేవీ వెళ్లకుండా అడ్డుకుంటోంది.

అరబ్ దేశాలు మాకు మద్దతివ్వాలె : హమాస్ 

ఇజ్రాయెల్ పై వెస్ట్ బ్యాంక్ నుంచీ అక్కడి రెసిస్టెంట్ ఫైటర్స్ కూడా దాడులు చేయాలని హమాస్ మిలిటెంట్లు పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో తమకు మద్దతుగా అరబ్, ఇస్లామిక్ దేశాలు ముందుకు రావాలని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్  కోరారు. యుద్ధంలో తాము గెలుపు అంచున ఉన్నామన్నారు. కాగా, అనేక మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకున్న ఫొటోలను హమాస్ ఆదివారం రిలీజ్ చేసింది. గాజాకు సమీపంలోని సెడార్ట్ టౌన్ లోని వీధుల్లో సైనికులు, ప్రజల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి.

మాకిది బ్లాక్ డే : నెతన్యాహు

ఇజ్రాయెల్ కు శనివారం బ్లాక్ డే అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. హమాస్​ను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బలగాలు సర్వశక్తు లు ఒడ్డుతాయని చెప్పారు. మిలిటెంట్లు దాక్కున్న స్థావరాలను నేలమట్టం చేస్తామని చెప్పారు. గాజాలోని హమాస్ స్థావరాలకు దగ్గరగా ఉన్న ప్రజలంతా దూర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. దేశం సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగిస్తోందని నెతన్యాహు చెప్పారు. ‘‘హమాస్ మాపై ప్రాణాంతక దాడులకు దిగింది. యుద్ధంలో ఫస్ట్ ఫేజ్ ముగిసింది. మా దేశంలోకి చొరబడిన శత్రు మూకలను చాలా వరకూ నాశనం చేశాం. అదేటైంలో గాజాపై దాడులు చేస్తున్నాం. టార్గెట్లు పూర్తయ్యేదాకా దాడులు ఆపబోం” అని ఆయన ప్రకటించారు. కష్ట సమయంలో తమకు 8 బిలియన్ డాలర్ల మిలిటరీ ప్యాకేజీని ప్రకటించిన అమెరికాకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.

ఇది మాపై ‘9/11’: ఇజ్రాయెల్ 

హమాస్ మిలిటెంట్ల నరమేధం అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన టెర్రర్ అటాక్ ను తలపిస్తోందని ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘ఇది మాపై జరిగిన ‘9/11’ తరహా టెర్రర్ అటాక్. హమాస్ మిలిటెంట్లు మాపై అనూహ్య రీతిలో నరమేధానికి దిగారు” అని యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ అంబాసిడర్ పేర్కొన్నారు. హమాస్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.