
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం అర్థరహితమని, ఆ ఒప్పందం సంతకం చేయబోమని హమాస్ తెలిపింది. ఈ విషయాన్ని హమాస్ పొలిటికల్ బ్యూరో మెంబర్ హోసం బద్రాన్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. గాజాను హమాస్ మెంబర్లు వదిలివెళ్లాలని ట్రంప్ చేసిన ప్రతిపాదన అర్థరహితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు తెగబడితే, తాము కూడా అలాగే స్పందిస్తామని చెప్పారు.
అలాగే, ఆయుధాలు వదిలేయాలన్న ట్రంప్ సూచనను అస్సలు పాటించబోమని, అది జరిగే పని కాదన్నారు. ‘‘ఆయుధాల అప్పగింత అనేది ఔట్ ఆఫ్ క్వశ్చన్. దానిపై సంప్రదింపులు ఉండవు” అని బద్రాన్ స్పష్టం చేశారు. కాగా.. ఇజ్రాయెల్ బందీలను హమాస్ టెర్రరిస్టులు సోమవారం లేదా మంగళవారం విడుదల చేస్తారని, అలాగే మృతదేహాలను కూడా అప్పగిస్తారని ట్రంప్ ఇంతకుముందు పేర్కొన్నారు. దీంతో హమాస్ ఆవిధంగా స్పందించింది.