ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోంది

ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోంది
  •  నా రాజకీయ ప్రస్థానం మొదలయింది చేనేత కార్మికులతోనే
  • చండూరులో చేనేత కార్మికుల ధర్నాకు మద్దతు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా:  ‘‘నా రాజకీయ ప్రస్థానం మొదలయింది చేనేత కార్మికుల తోనే.. మీ బిడ్డలా చెబుతున్నా.. మీ కోసం పోరాటం చేస్తా.. ధర్మం వైపు నిలబడండి.. మీకు అభివృద్ధి చేయలేకపోయాను కాబట్టే రాజీనామా చేశా..’ అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చేనేత వ్రస్తాలపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తూ మార్కండేయ స్వామి ఆలయంలో చేనేత కార్మికులు చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో చేనేత కార్మికులకు పూటగడవడం కష్టంగా ఉందని.. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాలలో అప్పుల పాలయ్యిందన్నారు. 

కష్టాలలో ఉన్న ప్రజల కోసం ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిందని.. ప్రపంచంలో మునుగోడు నియోజకవర్గం ఎక్కడ ఉందా ? అని  ప్రపంచమంతా ఇప్పుడు మునుగోడు వైపు చూస్తోందన్నారు. పేద వారిని గుర్తించండి, నాలాంటి వారికి రైతు బంధు అవసరం లేదు.. అయితే భూ స్వామికి రైతు బంధు వస్తోంది.. కౌలు కూడా వస్తోంది..  అసలు కౌలు రైతు అప్పుల పాలైతుండు అని ఆందోళన వ్యక్తం చేశారు. 

మునుగోడు ఉప ఎన్నిక తీర్పుతో తెలంగాణలో మార్పు 

మునుగోడు నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నిక తీర్పుతో తెలంగాణలో మార్పు వస్తుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నేను అధికారం అడ్డుపెట్టుకొని అమ్ముడు పోయినానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు, మార్కండేయ స్వామి సాక్షిగా నిజం చెబుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.