
ముంబై : మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులు ఏడాది కాలంలో కొత్తగా 50 వేల మందికి జాబ్స్ ఇవ్వనున్నారు. ఇందులో ఎక్కువ జాబ్స్ ఎంట్రీ–లెవెల్, కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పన్ను తగ్గింపును ప్రయోజనంగా మలుచుకోవాలని మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులు ఆశిస్తున్నట్లు ఇండస్ట్రీ, హెచ్‌ఆర్ నిపుణులు చెబుతున్నారు. కొత్త తయారీ యూనిట్లపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 15 శాతానికి తగ్గించడంతో, హ్యాండ్‌సెట్ తయారీదారులు తమ విస్తరణ ప్రాజెక్టులను ఖరారు చేస్తున్నారు. వారిలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్స్ కూడా ఉన్నారు. దేశీయ మార్కెట్‌లో విక్రయానికే కాకుండా, ఎగుమతుల మార్కెట్ మీదా ఆ తయారీదారులు గురిపెట్టారు.
ఇక రీఫర్బిష్డ్ ఫోన్ల విభాగంలోనూ కొత్త ఉద్యోగాలు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి–మార్చి నుంచి ఈ కొత్త ఉద్యోగాల కల్పన ఊపందుకుంటుందని అంచనా. గత రెండేళ్లలో ఈ పరిశ్రమ దాదాపు 15 శాతం ఉద్యోగులపై వేటు వేసింది. మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో దాదాపు 3.5 లక్షల మంది పనిచేస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో మొబైల్ హ్యాండ్‌సెట్స్ ఎగుమతులు 10–15 శాతం, దేశీయ అమ్మకాలు 5–10 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు సీఐఈఎల్ హెచ్ ఆర్ సర్వీసెస్ సీఈఓ నారాయణ్ మిశ్రా వెల్లడించారు. ఈ అంచనాలు అందుకునే దిశలో ఈ రంగంలో ఉద్యోగాలు రాబోయే ఏడాది కాలంలో 15 శాతం, అంటే 52 వేల దాకా పెరుగుతాయని చెప్పారు. ఎకానమికి ఉత్తేజం ఇవ్వడానికి పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, ఇటీవలే కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించింది. ముఖ్యంగా కొత్త మాన్యుఫాక్చరింగ్ యూనిట్లకు పన్నులు బాగా తగ్గించింది. సేల్స్, మార్కెటింగ్, సపోర్ట్ విభాగాలలో మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీదారులు కొత్తగా 15 నుంచి 20 వేల కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటారని అంచనా వేస్తున్నట్లు మాన్‌పవర్ గ్రూప్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్ వ్యాపారం జోరందుకోవడంతో రిటైల్ షోరూమ్‌ల సంఖ్య తగ్గడంతో, సేల్స్‌తోపాటు ఇతర విభాగాలలోనూ గత రెండేళ్లలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. చైనా మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులకు ఇండియా కంపెనీలు పోటీ ఇవ్వలేక చతికిలపడటమూ ఉద్యోగాలు తగ్గడానికి మరో కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఐతే, ఇప్పుడు లోకల్ కంపెనీలు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్స్‌గా మారి తమ యూనిట్లను తిరిగి ఉపయోగంలోకి తెచ్చుకుంటున్నాయని పేర్కొన్నాయి.
ఇండియాలో మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ 2025 నాటికి 100 కోట్ల సంఖ్యను అందుకుంటుందని ఇటీవలే ఐసియా ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ చెప్పారు. లోకల్ మాన్యుఫాక్చరింగ్ ఊపందుకుంటుందని హ్యాండ్‌సెట్ కంపెనీ వీవో ఈ మధ్యనే ప్రకటించింది. దీంతో లోకల్ టాలెంట్‌కు డిమాండ్ ఏర్పడుతుందని తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయం సరైన దిశలో తీసుకున్న చర్యని, దేశీయ మాన్యుఫాక్చరింగ్ రంగానికి ఇది ఖచ్చితంగా ఊతమిస్తుందని వీవో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ట్రాటజీ) నిపుణ్ మార్య చెప్పారు. ఈ చైనా కంపెనీ కోసం ప్రస్తుతం 7,500 మంది పనిచేస్తుండగా, కెపాసిటీ పెరుగుతుండటంతో మరో 2,500 మందిని కొత్తగా తీసుకోవాలని వీవో ప్లాన్ చేస్తోంది.