కశ్మీర్ లో 60గంటలకు పైగా ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం

కశ్మీర్ లో 60గంటలకు పైగా ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లోని హంద్వారాలో 60 గంటలకు పైగా సాగిన భీకర పోరు ముగిసింది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అయితే.. ఉగ్రవాదుల కాల్పుల్లో.. ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. మరోవైపు.. సరిహద్దులో పాక్ సైన్యం.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.

కుప్వారా జిల్లా హంద్వారా దగ్గరలోని క్రాల్ గుండ్ ప్రాంతంలోని బాబాగుండ్ లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో శుక్రవారం నాడు ఆర్మీ, CRPF, జమ్మూకశ్మీర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు… సెర్చ్ పార్టీపై విచక్షణా రహిత కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు, స్థానిక పౌరుడు ఒకరు చనిపోయారు. శుక్రవారం మొదలైన ఎన్ కౌంటర్ ఆదివారం మధ్యాహ్నం తర్వాత ముగిసింది. ఎన్ కౌంటర్ ముగిశాక.. చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలు సోదాలు చేశాయి. ఇద్దరు ఉగ్రవాదుల శవాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వారి గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. ఎన్ కౌంటర్ స్పాట్ లో పేలుడు పదార్థాలు, ఆయుధాలను రికవరీ చేశాయి బలగాలు. మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు కొనసాగించింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్ లో నియంత్రణ రేఖ దగ్గర… మోర్టార్ షెల్స్ తో ఫైరింగ్ చేశారు. భారత సైన్యం కూడా పాక్ కాల్పులను తిప్పికొట్టింది.

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని మోడీ. ఈ భేటీకి రక్షణమంత్రి నిర్మలాసీతారామన్, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే హాజరయ్యారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ జమ్మూకశ్మీర్ లో పర్యటించారు. సాంబా, రత్నుచక్ సహా వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించిన రావత్… ఆర్మీ ఫార్వార్డ్ పోస్ట్ లను పరిశీలించారు. జవాన్లతో మాట్లాడారు. సన్నద్ధతపై రివ్యూ చేశారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని చెప్పారు.