మా కొడుకులను వదలొద్దు

మా కొడుకులను  వదలొద్దు

మక్తల్, వెలుగు:

వెటర్నరీ డాక్డర్​ హత్య కేసులో నిందితులుగా ఉన్న తమ కొడుకులు నేరం చేసింది నిజమైతే వాళ్లను చంపేయాలని వారి తల్లులు అన్నారు. తొమ్మిది నెలలు మోసి కన్న బంధాన్ని కాల్చివేసిన ఆ రాక్షసులు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటేనని మీడియాకు తెలిపారు. ఇంతటి ఘాతుకానికి తెగబడుతారని తెలిసుంటే ముందే వాళ్లను చంపేసేవాళ్లమని వారు పేర్కొన్నారు. మృతురాలి తల్లి కడుపుకోత తమకు తెలుసని, ఏ తల్లికి అలాంటి బాధ రావొద్దని అన్నారు.

 

వాడ్ని ఉరితీసినా తప్పులేదు

వెటర్నరీ డాక్టర్​ను నిందితులు ఎట్ల చంపిండ్రో నా కొడుకును కూడా అట్లనే చంపుండ్రి. ఉరితీయుండ్రి.. లేకుంటే కాల్చిచంపుండ్రి. నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కొడుకును కనలేదు కదా.. ఆ అమ్మాయి(వెటర్నరీ డాక్టర్​) తల్లి కూడా ఆ అమ్మాయిని తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్ద చేసింది. ఆ తల్లిదీ కడుపుకోతే. నాకు కూడా ఆడబిడ్డలు ఉన్నరు. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరూ వినరు. మునుపటి ఏడాది వాడు లవ్‌‌‌‌ మ్యారేజీ చేసుకున్నప్పుడు ఏమనలే. అయిందేదో అయిందనుకున్నం. వాడికి కిడ్నీ ఖరాబైంది. జక్లేర్‌‌‌‌ అనే వాడితో (ప్రధాన నిందితుడు మహ్మద్‌‌‌‌ ఆరిఫ్) దోస్తీ కట్టి ఆగమైండు. లారీ లోడ్‌‌‌‌ చేసేటిదుందని మా ఇంటికాడికి ఆరిఫ్​ వచ్చి నా కొడుకును తోలుకపోయిండు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుకుంటున్నరు. కన్న కొడుకు ఇసుంటి పని చేసిండని తెలిసి నా భర్త ఆత్మహత్య చేసుకుందామనుకున్నడు.

– చెన్నకేశవులు తల్లి

ఉన్నా ఒకటే.. చచ్చినా ఒకటే

నా కొడుకు ఆ అమ్మాయిని కాల్చి చంపిండని అంటున్నరు. నిజంగా కాల్చి చంపితే.. అట్లనే వాడ్ని కూడా కాల్చి చంపుండ్రి. నా భర్త  12 ఏండ్ల కింద చనిపోయిండు. ఉన్న ఒక్క కొడుకు నవీన్​..  ఆరీఫ్​ సోపతిపట్టి చెడిపోయిండు. వాడు ఇంత ఘోరమైన పని చేస్తడని అనుకోలేదు. ఇసుంటి తప్పు చేసిండని తెలిసి నా గుండె తరుక్కుపోతున్నది. వాడు ఉన్నా ఒకటే.. చచ్చినా ఒకటే. గురువారం రాత్రి 2 గంటలకు నవీన్​ ఇంటికి వచ్చిండు. అప్పుడే నేను ఊర్ల పెండ్లికెంచి వచ్చిన. రెండు రోజులునుంచి ఎందుకు ఫోన్​ చేయలేదురా అని అడిగితే.. లారీ పనికి పోయినని చెప్పిండు.

– జొల్లు నవీన్​ తల్లి

తప్పు చేస్తే విడిచిపెట్టొద్దు

నా కొడుకు శివ వయసు 17ఏండ్లు ఉంటయి. వీడు తప్పు చేసిండంటే నమ్మబుద్ధయితలేదు. మొన్నటిదాకా పొలం పని చేసుకుంట ఉండెటోడు. రెండు నెలల కిందనే ఆరిఫ్​ వచ్చి లారీకి క్లీనర్​గా పెట్టుకున్నడు. నా కొడుకుకు అప్పుడప్పుడు ఛాతీల నొప్పి వస్తుండె.. నొప్పొచ్చినప్పడుల్లా రక్తం కక్కుతుండె. మావోడు తప్పు చేసిండో లేదో తెల్వదు. తప్పు చేసి ఉంటే ఆ భగవంతుడికి ఈ భూతల్లికి తెలుసు. నా కొడుకు వయస్సు చిన్నది.. వాడు అసుంటి పనులు చేసే రకం కాదు. ఆరిఫ్​ ఏం చేసిండో నాకు తెల్వదు. నా కొడుకు తప్పు చేసినట్లయితే మిగతా ముగ్గురికి ఎసుంటి శిక్ష వేస్తే అసుంటిదే వాడికి వేయుండ్రి.

– జొల్లు శివ తల్లి

పిల్లకు టక్కరిచ్చిన అన్నడు

నా కొడుకు ఆరిఫ్​ గురువారం రాత్రి పన్నెండు, ఒకటి గంటల మధ్య ఇంటికి వచ్చిండు. భయం భయంగా కనిపించిండు. ఏందిరా గట్లున్నవు అని అడిగితే..  ‘‘ఏం కాలేదమ్మా.. నా లారీ యాక్సిడెంట్​ అయింది. ఓ పిల్లకు టక్కరిచ్చిన. ఏమైందో తెలస్తలేదు.. దాని గురించే భయమైతున్నది” అన్నడు. వాడు తప్పు చేసెటోడు కూడా కాదు. వాడు నిజంగా నేరం జేస్తే.. వాడికి కూడా మిగతా ముగ్గురికి ఏ శిక్ష వేస్తరో అదే వేయుండ్రి.

– మహ్మద్​ ఆరిఫ్​ తల్లి