క్యాటరింగ్ లోపాలు.. IRCTC కి రూ. 60లక్షల జరిమానా

క్యాటరింగ్ లోపాలు.. IRCTC కి రూ. 60లక్షల జరిమానా

సెమీ హైస్పీడ్ రైలు  వందే భారత్ లో ప్రయాణికులకు వడ్డించే ఆహారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భారతీయ రైల్వే మరోసారి స్పష్టం చేసింది. ఆహార నాణ్యతలో లోపాలు వెలుగుచూడటంతో, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), పై ఫుడ్ క్యాటరింగ్ సప్లయర్లకు రూ. 60లక్షల  భారీ జరిమానా విధించింది. 

మార్చి 15న పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Train No. 21896) లో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు తమకు వడ్డించిన ఆహారం ఏమాత్రం బాగోలేదని, నాసిరకంగా ఉందంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సర్వీసులో లోపం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, సేవా నాణ్యతను కాపాడటంలో విఫలమైనందుకు IRCTCకి రూ. 10 లక్షలు, ఫుడ్య క్యాటరింగ్ సప్లయర్ కు రూ. 50లక్షల జరిమానాతోపాటు కాంట్రాక్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రయాణికుల భద్రత, ఆరోగ్యం ,సేవా నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని రైల్వే శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణికులు భారీగా ఛార్జీలు చెల్లిస్తారని, వారికి నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరిస్తూ X లో పోస్ట్ చేసింది. భారతీయ రైల్వే, IRCTC  నెట్‌వర్క్‌ ద్వారా ప్రతిరోజూ 15 లక్షల మందికి పైగా ప్రయాణికులకు భోజనం అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే రైలులో ఆహారాన్ని అందించే అతిపెద్ద కార్యకలాపాలలో ఒకటి.