- డేటా బ్యాంక్ తప్పనిసరి: రేవంత్
- కీలక శాఖల మధ్య సమన్వయం అవసరం
- ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ వెల్లడి
- ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌తో భేటీ
- జీఎస్టీ, ఎక్సైజ్ శాఖ సంస్కరణలు,
- మోడ్రన్ టెక్నాలజీ వినియోగంపై చర్చ
- పన్ను వసూళ్ల వ్యవస్థ బలోపేతానికి
- డేటా బ్యాంక్ తప్పనిసరి: రేవంత్
- ప్రతిపాదించిన సంస్కరణలను వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల్లో నకిలీ బిల్లులు, అక్రమ మార్గాల ద్వారా జరుగుతున్న లీకేజీలకు ఏఐతో చెక్ పెట్టవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. అదే సమయంలో కీలక ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
శుక్రవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ సహా ఇతర ముఖ్య అధికారులతో అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో తక్షణమే చేపట్టాల్సిన సంస్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు. ముఖ్యంగా భవన, నిర్మాణ రంగానికి సంబంధించి భారీ స్థాయిలో పన్నుల లీకేజీ జరుగుతుందనే అంచనాల నేపథ్యంలో మున్సిపల్, రెరా, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల డేటాను ఏఐ సాయంతో అనుసంధానించాలని ప్రతిపాదించారు.
భారీ భవనాలు, మైనింగ్, కాంట్రాక్టు పనులకు సంబంధించి బిల్డర్లు లేదా సంస్థలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే దశలోనే.. ఆయా నిర్మాణాలకు అవసరమయ్యే సామగ్రి, దానికి తగ్గట్టుగా చెల్లించాల్సిన పన్నుల అంచనా వివరాలను ప్రాథమికంగా నమోదు చేసేలా నిబంధనలు తీర్చిదిద్దాలని సూచించారు. దీంతో నిర్మాణం పూర్తయ్యాక చెల్లించే జీఎస్టీలో జరిగే గోల్‌మాల్‌కు ప్రారంభంలోనే అడ్డుకట్ట పడుతుందని అరవింద్ సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్‌ను దెబ్బతీయొద్దు..
ఓవైపు ఖజానాకు వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటూనే.. మరోవైపు రాష్ట్రంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వాతావరణాన్ని దెబ్బతీయకుండా చూడడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత డేటా విశ్లేషణ వ్యవస్థ అమల్లోకి వస్తే మైక్రో లెవెల్‌లో తనిఖీలు, అనవసరమైన అధికారుల వేధింపులు తగ్గిపోతాయని, కేవలం సమాచార లోపాలు లేదా వ్యత్యాసాలు ఉన్న చోట మాత్రమే సాంకేతికత ఆధారంగా హెచ్చరికలు వెళ్తాయని వివరించారు.
ఇది నిజాయతీగా పన్నులు చెల్లించే వ్యాపారులకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని, అదే సమయంలో అక్రమాలకు పాల్పడేవారికి చెక్ పెడుతుందని చెప్పారు. పన్ను వసూళ్ల పెంపు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సంస్కరణలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా తగిన కార్యాచరణ రూపొందించాలని కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
డేటా బ్యాంక్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి: సీఎం
ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో పారదర్శకత పెంచడంతో పాటు పన్ను వసూళ్ల విధానాన్ని బలోపేతం చేసేందుకు సమగ్ర సమా చార వ్యవస్థ (డేటా బ్యాంక్) ఎంతో అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భవన నిర్మాణాల డేటాతోపాటు రాష్ట్రంలో అమలవుతున్న మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ వివరాలను సైతం ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తే పరిపాలనాపరంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు.
సంక్షేమ పథకాలు, పబ్లిక్ సేవల డేటాను కమర్షియల్ టాక్స్ డేటాతో విశ్లేషించడం ద్వారా అర్హులైన వారికి ఫలాలు అందించడమే కాకుండా, పన్ను ఎగవేతదారుల ను సులభంగా పసిగట్టవచ్చని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం పన్నుల వసూ లుకే పరిమితం చేయకుండా మొత్తం గుడ్ గవ ర్నెన్స్‌కు అనుసంధానించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ భేటీలో సీఎం సలహాదారు రామ కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు, కమర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్‌రావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ పాల్గొన్నారు.
