- రూ.590 కోట్ల ఆదాయం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన విశాక ఇండస్ట్రీస్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తన తొలి క్వార్టర్లో అదరగొట్టింది. కంపెనీ ఈసారి రూ.590.07 కోట్ల (కన్సాలిడేటెడ్) రాబడిని సాధించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 16.72 శాతం ఎక్కువ. నికర లాభం (కన్సాలిడేటెడ్) రూ.52.68 కోట్లకు చేరింది. రాజస్థాన్‌లోని టోంక్ ప్రాంతంలో సరికొత్త బోర్డు తయారీ ఫ్యాక్టరీ కోసం రూ.175 కోట్ల భారీ మూలధన వ్యయానికి బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ కొత్త ప్లాంటు ద్వారా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. కంపెనీ వాటాదారులకు ప్రతి ఈక్విటీ షేరుపై రూపాయి చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. బిల్డింగ్ ఉత్పత్తులకు మార్కెట్లో లభిస్తున్న బలమైన డిమాండ్ కారణంగానే ఈ మేర వృద్ధి సాధ్యమైందని విశాక ఇండస్ట్రీస్ తెలిపింది.
ఆస్తుల విక్రయాల ద్వారా వచ్చిన అదనపు లాభాలు కూడా సంస్థ ఆర్థిక పనితీరుకు మరింత ఊతమిచ్చాయి. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తామని విశాక యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది.
