యుద్ధం ఓడిపోయినట్లు ఒప్పుకోకపోతే ఇరాన్‌కి చుక్కలు చూపిస్తాం: వైట్‌హౌస్ హెచ్చరిక

యుద్ధం ఓడిపోయినట్లు ఒప్పుకోకపోతే ఇరాన్‌కి చుక్కలు చూపిస్తాం: వైట్‌హౌస్ హెచ్చరిక

అమెరికా ఎంత చెప్పినా ఏం చేసినా ఇరాన్ మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా యుద్ధంలో ముందుకు సాగుతోంది. తాము కోల్పోయిన దాని కంటే శత్రువుకు నష్టం కలిగించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇరాన్ రెవల్యూషినరీ గార్డ్స్. ఈ క్రమంలో మధ్యవర్తిత్వం కోసం అనేక దేశాల ద్వారా ట్రంప్ తెరవెనుక కదుపుతున్న పావులు అస్సలు ఫలించటం లేదు. దీంతో ట్రంప్ పూర్తిగా నిరాశ చెందటంతో మరోసారి ఇరాన్ కి గట్టి దమ్కీ ఇచ్చే ప్రయత్నం స్టార్ట్ చేశారు. 

అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ షరతులను ఇరాన్ తిరస్కరించిన నేపథ్యంలో.. ఆ దేశంపై సైనిక చర్యను మరింత తీవ్రం చేసేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ హెచ్చరించింది. ఇరాన్ గనుక శాంతి ఒప్పందానికి లోబడకపోతే.. తదుపరి ప్రతిస్పందన ఊహించని విధంగా చాలా బలంగా ఉంటుందని వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. శాంతి స్థాపనకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని, అయితే ఇరాన్ తన ఓటమిని అంగీకరించకపోతే నిర్ణయాత్మక చర్యలు తప్పవని చెప్పారు.

అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ ఊరికే బెదిరింపులకు దిగరని, అవసరమైతే ఇరాన్‌పై పూర్తిస్థాయి దాడికి సిద్ధంగా ఉన్నారని లీవిట్ హెచ్చరించారు. గతంలో ఇరాన్ చేసిన తప్పుడు అంచనాల వల్ల ఇప్పటికే ఆ దేశం తన అగ్ర నాయకత్వాన్ని, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కోల్పోయిందని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ మరోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సలహా ఇచ్చారు.

కానీ అమెరికా మాటలను అస్సలు పట్టించుకోని ఇరాన్‌ తనదైన దారిలో ముందుకు సాగుతోంది. యుద్ధం ఆపాలంటే అది తమ షరతులకు లోబడే జరగాలని తేల్చి చెబుతోంది. దీంతో జరుగుతున్న ఈ పోరాటంలో అమెరికా దళాలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయని, ఆపరేషన్ షెడ్యూల్ కంటే వేగంగా జరుగుతోందని వైట్ హౌస్ మరోపక్క వార్నింగ్ ఇస్తోంది. ప్రారంభంలో ఈ యుద్ధం నాలుగు నుండి ఆరు వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేయగా.. ప్రస్తుతం అంతకంటే వేగంగానే ఫలితాలు వస్తున్నాయని లీవిట్ చెబుతున్నారు. అయితే అమెరికా పంపిన 15 అంశాల కాల్పుల విరమణ ప్రతిపాదనను టెహ్రాన్ తిరస్కరించినప్పటికీ, ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని అవి సానుకూలంగానే ఉన్నాయని వైట్ హౌస్ ధృవీకరించింది. మెుత్తానికి ఇరాన్ ని భయపెట్టైనా, బ్రతిమాలైనా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రంప్ తిప్పలు పడుతున్నట్లు తాజా పరిస్థితులపై నిపుణులు కామెంట్ చేస్తున్నారు.