మహబూబాబాద్/ తొర్రూరు, వెలుగు: ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ సూచించారు. రైతుల పంట రుణాలు, విద్యా రుణాలు, ఎస్‌హెచ్‌జీ రుణాలు, ఇతర అంశాలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు సంబంధించి రూ.4830.32కోట్ల లక్ష్యంగా నిర్ణయించగా, 2025, డిసెంబరు నాటికి 75.15 శాతం వివిధ రుణసహాయం అందించినట్లు తెలిపారు.
రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు బ్యాంకర్లు ఆర్థిక తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం కలెక్టర్తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్‌లో చైర్మన్ శ్రావణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పన్నుల వసూళ్లతోనే మున్సిపల్డెవలప్మెంట్ అవుతుందన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ఈ సందర్భంగా 2026_27 బడ్జెట్ అంచనాలు ఆదాయం రూ.1784.98 కోట్లు, వ్యయం రూ. 1783.22 కోట్లను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ సోమ రజిని, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, కౌన్సిల్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
