వివాదాలకు కేరాఫ్ ఆర్జీయూకేటీ.. కీలక పోస్టుల ఖాళీతో వర్సిటీ ఆగమాగం

వివాదాలకు కేరాఫ్ ఆర్జీయూకేటీ.. కీలక పోస్టుల ఖాళీతో వర్సిటీ ఆగమాగం
  • స్టేట్​లో ఛాన్స్ లర్ లేని వర్సిటీ ఇదే..
  • డైరెక్టర్ సహా పలు పోస్టులకు ఇన్​చార్జీలూ కరువు
  • టీచింగ్ సిబ్బందికి నాన్ టీచింగ్ పనులు
  • సిలబస్ పూర్తికాక స్టూడెంట్లకు అవస్థలు 
  • విద్యార్థిని మృతితో మరోసారి క్యాంపస్​లో నిరసనలు 

హైదరాబాద్, వెలుగు:  బాసర ట్రిపుల్ ఐటీ వర్సిటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది ఇష్టారాజ్యంతో అప్రతిష్టపాలవుతోంది. కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటం, రెగ్యులర్ వీసీ లేకపోవడంతో వర్సిటీ పాలన పూర్తిగా గాడితప్పుతోంది. తాజాగా ఓ విద్యార్థిని చనిపోవడంతో క్యాంపస్‌లో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. 

కీలక పోస్టుల ఖాళీ..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్జీయూకేటీకి ప్రభుత్వం ఒక్కసారి కూడా రెగ్యులర్ వీసీని నియమించలేదు. ప్రస్తుత వీసీ కూడా ఇన్​చ్చార్జీనే. ఇక కీలకమైన ఛాన్స్ లర్, డైరెక్టర్, ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(రిజిస్ట్రార్), కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, అసోసియేట్ ఫర్ ఆర్ అండ్ డీ లాంటి అత్యంత కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. వర్సిటీకి బాధ్యత గల అధికారులు లేకపోవడంతో నిర్ణయాలు తీసుకునే నాథుడే కరువై అకాడమిక్ స్టాండర్డ్స్ పూర్తిగా పడిపోతున్నాయి. వీకెండ్ ఎగ్జామ్స్ తీసివేయడం, అనాలోచిత నిర్ణయాలతో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో వర్సిటీకి రావాల్సిన ర్యాంకుల సంఖ్య తగ్గుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.     

వర్సిటీ నిధులు ఇష్టారీతిన ఖర్చు 

ప్రస్తుతం ఇన్​చార్జి వీసీ తనకు నచ్చిన వ్యక్తిని ఓఎస్డీగా నియమించుకోవడాన్ని విద్యార్థులు తప్పుపట్టగా.. ఆయననే ఏకంగా ఇన్​చార్జి ఏవోగా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గవర్నింగ్ కౌన్సిల్ లేకపోవడంతో వర్సిటీ నిధులను ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓ కాంట్రాక్టర్‌కు సంబంధించిన పాత బిల్లులను అక్రమంగా విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వర్సిటీ క్వార్టర్లలో ఉండే ఫ్యాకల్టీ కుటుంబసభ్యులే క్యాంపస్‌లో వివిధ పనులు చేస్తుండటంతో పర్యవేక్షణ లోపిస్తోంది. ప్రస్తుతమున్న ఇన్​చార్జి వీసీ అడ్మినిస్ట్రేషన్ అంశాలను సరిగా డీల్ చేయలేక ఓఎస్​డీపైనే ఆధారపడుతున్నారనే ఆరోపణలున్నాయి. 

టీచింగ్ సిబ్బందికి నాన్ టీచింగ్ పనులు..

వర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీని బోధనకు పరిమితం చేయకుండా వర్సిటీ అధికారులు నాన్ టీచింగ్ పనులు అప్పగించారు. చదువుకు సంబంధం లేదని నెట్ వర్కింగ్, ప్రొక్యూర్​మెంట్, ఎస్టాబ్లిష్​మెంట్, అకౌంట్స్, వాటర్ వర్క్స్, గార్డెనింగ్, ఎలక్ట్రికల్, హౌజ్ కీపింగ్, హాస్పిటల్ ఇన్​చార్జి.. తదితర నాన్ టీచింగ్ పనులన్నీ వారికే అప్పగించారు. దీంతో చాలామంది ఫ్యాకల్టీ పాఠాలు చెప్పడం తగ్గించి.. అదనపు పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా ఇన్​టైమ్​లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లేకపోవడం, గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకురావడంతో నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్లను నియమిస్తేనే అకాడమిక్స్ గాడిలో పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ వీసీని నియమించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి వర్సిటీని ప్రక్షాళన చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.