క్రూయిజ్ షిప్‌‌‌‌లో హంటా వైరస్ కలకలం..ముగ్గురు మృతి, పలువురికి పాజిటివ్

క్రూయిజ్ షిప్‌‌‌‌లో హంటా వైరస్ కలకలం..ముగ్గురు మృతి, పలువురికి పాజిటివ్
  • కాంటాక్ట్ ట్రేసింగ్ లేకుండానే దిగిపోయిన మరో 40 మంది ప్రయాణికులు
  • రంగంలోకి డబ్ల్యూహెచ్‌‌‌‌ఓ..

న్యూఢిల్లీ: విహారయాత్రలో భాగంగా అర్జెంటీనా నుంచి స్పెయిన్‌‌‌‌కు బయలుదేరిన 'ఓషన్‌‌‌‌వైడ్ ఎక్స్‌‌‌‌పెడిషన్స్' సంస్థకు చెందిన క్రూయిజ్ షిప్‌‌‌‌లో ప్రాణాంతకమైన హంటా వైరస్ కలకలం రేపుతున్నది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు షిప్‌‌‌‌లోని ముగ్గురు ప్యాసింజర్లు మరణించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నది. మొదటగా ఏప్రిల్ 11న ఒక డచ్ వ్యక్తి నౌకలోనే వైరస్ తో మరణించాడు. దాంతో అతని డెడ్ బాడీని ఏప్రిల్ 24న సెయింట్ హెలెనా ఐలాండ్ లో నౌక నుంచి కిందకు దించారు. 

మృతదేహంతోపాటు అతని భార్య షిప్ దిగి దక్షిణాఫ్రికాకు వెళ్లగా.. ఆమె కూడా వైరస్ లక్షణాలతో అక్కడే మరణించింది. మే 2న ఒక జర్మన్ మహిళ నౌకలోనే ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. ప్రస్తుతం షిప్‌‌‌‌లో ఉన్న మరికొందరు ప్రయాణికులు, షిప్ డాక్టర్‌‌కు కూడా వైరస్ సోకింది. దీంతో వీరిని యూరప్‌‌‌‌లోని ఆసుపత్రులకు పంపినట్లు డచ్ అధికారులు గురువారం వెల్లడించారు. 

వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం

మొదటి మరణం సంభవించిన 2 వారాల తర్వాత కూడా ఎటువంటి కాంటాక్ట్ ట్రేసింగ్ లేదా వైద్య పరీక్షలు లేకుండా సుమారు 40 మంది ప్రయాణికులు షిప్ దిగిపోయారు. ఇది అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ 40 మంది12 వేర్వేరు దేశాలకు చెందిన వారు కావడంతో వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్న ఒక ప్రయాణికుడికి వైరస్ పాజిటివ్‌‌‌‌గా నిర్ధారణ అయింది. 

హంటావైరస్ అనేది ఎలుకల విసర్జితాల ద్వారా సోకుతుంది. కానీ, ఈ నౌకలో గుర్తించిన ‘ఆండీస్ వైరస్’ రకం చాలా ప్రమాదకరమైనది. ఇది మనుషుల నుంచి మనుషులకు నేరుగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉంది. తాజా మరణాలను, ఘటనలను, షిప్ కదలికలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌‌‌ఓ) నిశితంగా గమనిస్తోంది.  నౌకలోని వారందరికీ క్వారంటైన్‌లో ఉంచి, టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.