ఇరాన్‌‌ తో చర్చల్లో పురోగతి సాధించాం...అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటన

ఇరాన్‌‌ తో చర్చల్లో పురోగతి సాధించాం...అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటన
  • పశ్చిమాసియాలో అద్భుత మార్పు దిశగా ప్రయత్నిస్తున్నామని వెల్లడి 
  • స్విట్జర్లాండ్‌‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల చర్చలు 

జ్యూరిచ్: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో గొప్ప పురోగతి సాధించామని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించారు. ఆదివారం స్విట్జర్లాండ్‌‌ ఓబ్‌‌బుర్గెన్‌‌ గ్రామంలోని రిసార్ట్ బుర్గెన్‌‌స్టాక్‌‌లో ఇరాన్ ప్రతినిధులతో తాజా రౌండ్ చర్చల అనంతరం మధ్యవర్తులుగా వ్యవహరించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌‌ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో కలిసి వాన్స్ మాట్లాడారు. ఈ చర్చలు తక్షణ భద్రతా ఆందోళనలను దాటి పశ్చిమాసియా భవిష్యత్తు గురించిన సంభాషణలోకి ప్రవేశించాయని ఆయన చెప్పారు. పశ్చిమాసియాలో అద్భుతమైన మార్పు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఈ చర్చలు ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. ‘‘గత కొన్ని గంటలలోనే మేం గొప్ప పురోగతిని సాధించాం. రాబోయే గంటలలో మరింత పురోగతి సాధిస్తామని ఆశిస్తున్నా”అని వాన్స్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం తన దౌత్య ప్రయత్నాల నుంచి ఇప్పటికే స్పష్టమైన ఫలితాలను చూసిందన్నారు.

ప్రత్యేకించి లెబనాన్‌‌లో తాత్కాలిక కాల్పుల విరమణ అమలును కొనసాగించేలా చూశామని ఆయన చెప్పారు. అయితే, ఇలాంటి ఒప్పందాలు అంత సులభంగా సాధ్యం కావని.. ఇలాంటి కాల్పుల విరమణలు ఎప్పుడూ కొంచెం గందరగోళంగానే ఉంటాయన్నారు. ఈ దౌత్య ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడినందుకు పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్‌‌లను వాన్స్ ప్రత్యేకంగా అభినందించారు. ‘‘గత మూడు నెలలలో నేను బహుశా ఫీల్డ్ మార్షల్ మునీర్‌‌తో మాట్లాడినంతగా మరెవరితోనూ మాట్లాడి ఉండను”అని చెప్పారు. 

అయితే, ఆదివారం నాటి సమావేశంలో చర్చించిన అంశాలు ఏమిటన్నది వాన్స్ వెల్లడించలేదు. మరోవైపు, ట్రంప్ దూరదృష్టి, అత్యంత డైనమిక్ నాయకత్వానికి షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్చలు అర్థవంతమైన ఫలితాలకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం పశ్చిమాసియాకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక ముఖ్యమైన మైలురాయి అని ఖతార్ ప్రధాని జాసిమ్ అల్ థానీ అభివర్ణించారు. కాగా, ఈ చర్చల్లో ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్, ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేతృత్వంలోని బృందం పాల్గొంది.   

చర్చలు విఫలమైతే.. హార్మూజ్‌‌లో టోల్ చార్జీలు వసూలు చేస్తాం: ట్రంప్  

ఇరాన్‌‌తో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే గనక హార్మూజ్ జలసంధిలో టోల్ ఫీజులు వసూలు చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్  హెచ్చరించారు. ‘‘కాల్పుల విరమణ కాలంలో 60 రోజుల పాటు హార్మూజ్ జలసంధిలో ఎటువంటి టోల్ చార్జీలు ఉండవు. ఈ 60 రోజుల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ఎటువంటి చార్జీలు ఉండవు. కానీ, ఒకవేళ ఒప్పందం పూర్తి కాకపోతే, పశ్చిమాసియా దేశాలకు ‘గార్డియన్ ఏంజెల్(రక్షక దేవదూత)’గా అందించిన సేవలకుగాను గత, వర్తమాన, భవిష్యత్తు ఖర్చుల రీయింబర్స్‌‌మెంట్ ప్రయోజనాల కోసం అమెరికా ద్వారా, అమెరికా కోసమే ఈ టోల్ చార్జీలను విధిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, ఆదివారం ఒకవైపు స్విట్జర్లాండ్‌‌లో చర్చలు జరుగుతుండగా, మరోవైపు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌‌లో మరో సంచలన పోస్ట్ పెట్టారు. లెబనాన్‌‌లో హెజ్బొల్లా అలజడులను ఆపాలని ఇరాన్‌‌కు అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ తన అనుబంధ హెజ్బొల్లా గ్రూపుకు భారీగా నిధులు ఇస్తూ, లెబనాన్‌‌లో సమస్యలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు. లెబనాన్‌‌లో హెజ్బొల్లా అలజడులను ఆపకపోతే.. ఇరాన్‌‌పై గతవారం జరిపిన దాడి కంటే తీవ్రమైన దాడి చేస్తామని, మరింత బలంగా కొడతామని ఆయన హెచ్చరించారు.