
హైదరాబాద్: మూసీ పునరుద్ధరణకు తాము అనుకూలమే అని, కానీ పునరుజ్జీవం పేరిట స్థిరాస్తి వ్యాపారం, కమీషన్లు, పేదల ఇండ్లు కూల్చడానికి బీఆర్ఎస్వ్యతిరేకమని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మూసీ నుంచి వాడపల్లికి వరకు పాదయాత్రకు సిద్ధంగా ఉన్నామని, రేపా? ఎల్లుండా ? టైం చెప్తే కేటీఆర్, తాను ఇద్దరం వస్తామని తెలిపారు. గన్ మెన్లు లేకుండా.. రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలని సవాల్‌విసిరారు. రాష్ట్రంలో ఇప్పటికప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని చెప్పారు.
తనను ఎలా డీల్ చేయటం సంగతి కాదు మొదట ఆయన సొంత కుర్చీని కాపాడుకోవాలని సూచించారు. కేసీఆర్ కు, రేవంత్ కు నక్కకూ.. నాగలోకాని ఉన్న తేడా ఉందన్నారు. ఇవాళ హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష. ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడింది. కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్ కి హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులును కూడా నింపలేదు’ అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డిది సెల్ఫ్ గోల్
మూసీని శుద్ధి చేయాలని సంకల్పించిందే కేసీఆర్ అని హరీశ్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్ బాధితులకు గచ్చిబౌలిలో 500 గజాల్లో ఇండ్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ అమలు చేయమంటే సస్పెండ్ చేయటం అన్యాయమన్నారు. తండ్రే తన పిల్లలను నమ్మనట్లు.. రేవంత్ తీరుందన్నారు. బాపూఘాట్ లో భారీ గాంధీ విగ్రహం పెడితే స్వాగతిస్తామని తెలిపారు. సీఎం తప్పిదాల వల్లనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యిందన్నారు. తాను ఫుట్ బాల్ ఆడనని.. క్రికెట్ ఆడుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గోల్ కొట్టేది, వికెట్ తీసేదీ తామే అని చెప్పారు. రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన్ను ఎలా డీల్ చేయాలో రాసి పెట్టుకుంటున్నామని పేర్కొన్నారు.