
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ కౌన్సిల్ శనివా రం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రానికి పరిహారం బకాయిల కింద రూ.548 కోట్లు రానున్నాయి. 2022 జూన్ కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార బకాయిలు రూ.16,982 కోట్లు విడుదల చేయాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆ నిధులను కేంద్రం తన సొంత నిధుల నుంచి ఇస్తోందని, భవిష్యత్తులో సెస్సుల ద్వారా సమకూరే మొత్తం ద్వారా ఆ నిధులను భర్తీ చేస్తామని పేర్కొంది.
దీంతో 2017 జీఎస్టీ చట్టం ప్రకారం ఐదేళ్ల కాలానికి చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని చెల్లించినట్లేనని స్పష్టం చేసింది. అలాగే జీఎస్టీ పరిహార బకాయిల కింద ఏపీకి రూ.689 కోట్లు రానున్నాయి. మరోవైపు బకాయిలు తక్కువ మొత్తంలో ఇస్తున్నారని, ఇంకా రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, జీఎస్టీ కౌన్సిల్మీటింగ్ కు రాష్ట్రం నుంచి మంత్రి హరీశ్‌రావు హాజరు కాలేదు. ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ ఆ మీటింగ్‌కు హాజరయ్యారు.