నిజామాబాద్ అర్బన్, వెలుగు: నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని, అధికారులు సైతం సమన్వయంతో పనిచేసి తనకు సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని, తాగునీరు, వీధి దీపాలు, మురుగునీటి కాలువల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని నంబర్ వన్ స్థానంలో నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ ఈఈ సుదర్శన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ డీఈ ప్రవీణ్, పబ్లిక్ హెల్త్ డీఈ నాగేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
