సింగరేణికి పరిరక్షణ కమిటీ ఉండాలి : వాసిరెడ్డి సీతారామయ్య

సింగరేణికి పరిరక్షణ కమిటీ ఉండాలి : వాసిరెడ్డి సీతారామయ్య

నస్పూర్, వెలుగు: సింగరేణి రక్షణ కోసం అన్ని యూనియన్లు, పార్టీలతో కలిపి ఒక పరిరక్షణ కమిటీ ఉండాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. గత 12 ఏండ్లుగా కొత్త గనులు రాలేదని, ఉన్న గనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

దాదాపు 12 వేల మంది కార్మికులు ఉన్న విశాఖ స్టీల్ కంపెనీ కోసం అన్ని పార్టీలు ఏకమై పోరాడడంతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు. అదే మాదిరిగా సింగరేణి రక్షణకు పోరాడాలని సూచించారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా అందరినీ కలుపుకుపోతామని తెలిపారు. 

ప్రస్తుతం వేలంపాట కోసం సింగరేణి కంపెనీ కాకుండా మరో 7 సంస్థలు టెండర్ ఫాంలు తీసుకున్నాయని చెప్పారు. వాటిని ఈ ప్రాంతానికి రాకుండా చూడాలన్నారు.  లీడర్లు  వీరభద్రయ్య, సమ్మయ్య, బాజీ సైదా, మొత్కుకూరి కొంరయ్య, నర్సింగరావు, అఫ్రోజ్ ఖాన్, విజయలక్ష్మి, అనంతరెడ్డి, సురేశ్​తదితరులు పాల్గొన్నారు.