హైదరాబాద్ శివారు మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. బుధవారం (డిసెంబర్ 17) తెల్లవారుజూమున అతి వేగంగా దూసుకెళ్లిన ఇన్నోవా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ షాప్‌లోకి దూసుకెళ్లింది. దీంతో షాపులో నిద్రిస్తోన్న ఇద్దరు మరణించారు. ఒకరు స్పాట్లోనే చనిపోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు బౌన్సర్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం అనంతరం సంఘటన స్థలం నుంచి బౌన్సర్లు పరార్ అయ్యారు. బౌన్సర్ల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
