అమెరికాలో నివసించే విదేశీయులు, పర్యాటకులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. జాతీయ భద్రతను మరింత కఠినతరం చేసే చర్యల్లో భాగంగా 'ట్రావెల్ బ్యాన్' లిస్టులోని దేశాల జాబితాను భారీగా విస్తరిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. థాంక్స్ గివింగ్ సెలవుల సమయంలో వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 26న వాషింగ్టన్ సమీపంలో జరిగిన కాల్పుల్లో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యురాలు సారా బెక్ స్ట్రోమ్ (20) మరణించగా, ఆండ్రూ వోల్ఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యుడైన లకాన్వాల్ అనే ఆఫ్ఘన్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను 2021లో 'ఆపరేషన్ అల్లీస్ వెల్కమ్' ద్వారా అమెరికాకు చేరుకున్నాడు. గతంలో ఆఫ్ఘన్ ఆర్మీలో 'జీరో యూనిట్'లో పని చేసిన అనుభవం ఉన్న ఇతను అమెరికాలో స్థిరపడిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తోంది. అయితే వైట్ హౌస్ సమీపంలో దాడి ఘటన అమెరికా వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీయడంతో వలస విధానాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపింది.
నిషేధిత దేశాల జాబితా ఇదే..
గతంలో జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఇరాన్, లిబియా, సోమాలియా సహా 12 దేశాలపై పూర్తి నిషేధం విధించగా.. మరికొన్ని దేశాలపై పాక్షిక ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా మార్పులతో ఈ జాబితా మరింత పెరిగింది.
* పూర్తి నిషేధం ఎదుర్కొంటున్న కొత్త దేశాలు: బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా.
* పాలస్తీనా అథారిటీ: పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పత్రాలతో ప్రయాణించే వారికి కూడా ప్రవేశాన్ని పూర్తిగా నిరాకరించారు.
* పాక్షిక ఆంక్షలు: అంగోలా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, జాంబియా వంటి మరో 15 దేశాలపై కఠినమైన ఎంట్రీపై యూఎస్ నిబంధనలు విధించింది.
అమెరికా సరిహద్దులను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది. అమెరికాలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద బ్యాగ్రౌండ్ ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అధికారులను ఆదేశించింది. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తూ, పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అమెరికా యంత్రాంగం పేర్కొంది.
