పేదల ఇండ్లతో పాటు గుళ్లు, మఠాలూ కూలుస్తున్నరు : హరీశ్ రావు

పేదల ఇండ్లతో పాటు గుళ్లు, మఠాలూ కూలుస్తున్నరు : హరీశ్ రావు
  •     రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని కూల్చేందుకు రేవంత్​సర్కారు కుట్ర: హరీశ్ రావు ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: పేదల ఇండ్లతో పాటు గుళ్లు, మఠాలనూ కూల్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్​ఎస్​ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆరోపించారు. కోకాపేట్ నియోపొలిస్‌లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

కనీసం నోటీసులు ఇవ్వకుండా రాత్రి 11.30 గంటలకు వందలాది మంది పోలీసులు, తహసీల్దార్లు వచ్చి ఆలయం వద్ద పీఠాధిపతిని, నిర్వాహకులను భయపెడతారా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన ఆలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. 2019లో కేసీఆర్  ప్రభుత్వంలో కోకాపేట సర్వే నంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా కేబినెట్​ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. 

పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి రూ. కోటీ 5 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని.. అలాగే, హెచ్ఎండీఏకు రూ.23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో శారద పీఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారన్నారు. కేసీఆర్​ ఆనవాళ్లు చెరిపేస్తా అంటున్న రేవంత్​.. కేసీఆర్​ కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమేనా అని హరీశ్​ ప్రశ్నించారు.