- అది ప్రభుత్వ భూమి అని ఫిబ్రవరి 24న ఎమ్మార్వో రిపోర్ట్: హరీశ్రావు
- 4 రోజుల్లోనే ప్రైవేట్ భూమిగా మార్పు
- ఏసీబీ అధికారులు రైడ్కు పోయి ప్రభుత్వ పెద్దల ఆర్డర్‌తో వాపస్ వచ్చేశారు
- సీఎంకు అత్యంత సన్నిహితుడు ఈ స్కామ్లో ఉన్నడని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదుగానీ.. ప్రభుత్వ భూములను అందినకాడికి కొల్లగొడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు.
శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని, ఇది వెయ్యి కోట్ల స్కామ్ అని ఆరోపించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
అంతకుముందు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం, ఇందిరాపార్క్ వద్ద లంబాడాల హక్కుల పోరాట సమితి ధర్నాలోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. అది ప్రభుత్వ భూమేనని ఫిబ్రవరి 24న ఎమ్మార్వో తేల్చారని, కానీ, నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 28న ప్రైవేటు భూమి అంటూ ఆర్డర్ పాస్ చేశారని ఆరోపించారు. నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఎలా మారిందని ప్రశ్నించారు. నిషేధిత జాబితాలో పెట్టాలని ఈ ఏడాది జనవరి 30న హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లోనూ తహసీల్దార్ పేర్కొన్నారని గుర్తు చేశారు.
ఇంత పెద్ద స్కామ్ జరిగితే అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
ఈ స్కాం గురించి పత్రికల్లో వస్తే, ఈ కేసులో కేవలం ఎమ్మార్వోను కలెక్టరేట్ కు బదిలీ చేసి ఊరుకున్నారన్నారు. ఏసీబీ అధికారులు రైడ్కు వెళ్తే.. ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారో ఏమోగానీ వాళ్లు వెంటనే వాపస్ వచ్చేశారన్నారు. ముఖ్యమంత్రికి అతిదగ్గరి వ్యక్తి ఇందులో ఉన్నడు కాబట్టే ఏసీబీ వెనక్కి వచ్చిందని, ఒత్తిడి కారణంగానే ఎమ్మార్వోను జస్ట్ బదిలీ చేసి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి కోట్ల విలువైన స్కామ్ వెనుక కలెక్టర్ ఉన్నడా.. ప్రభుత్వ పెద్దలున్నరా అని ప్రశ్నించారు. దీనిపై సిట్ లేదా సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
స్కామ్‌లకు కాంగ్రెస్ గని..
కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థ.. స్కాంలకు గనిలాగా మారిందని హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు సిరులగనిలా ఉన్న సింగరేణి.. ఇప్పుడు మేడిపండులా మారిపోయిందన్నారు. అందినకాడికి కాంగ్రెస్ దోచుకుంటున్నదని మండిపడ్డారు. సింగరేణిలోనూ రూ.1600 కోట్ల స్కామ్‌కు పాల్పడిందన్నారు. సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు కాంగ్రెస్ హయాంలో భారీగా పెరిగిపోయాయన్నారు. 2014లో కేవలం రూ.2 వేల కోట్లుగానే ఉండేదని, ఆ తర్వాత టీఎస్ జెన్కో నుంచి రూ.7 వేల కోట్ల డ్యూస్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవి రూ.21 వేల కోట్లకు పెరిగాయన్నారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వ ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్) రూ.3,200 కోట్లు. అదే సింగరేణిలో రూ.4 వేల కోట్లుగా ఉంది. ఫిక్స్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఈరోజు ఓడీకి పడిపోయింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని సింగరేణి అఫిషియల్ వెబ్ సైట్లో చూయిస్తోంది. దానిపై ఆదాయం వచ్చిందని ఆదాయపు పన్ను కూడా కట్టారు. ఆ బొగ్గు విలువ రూ.1600 కోట్లు. కానీ, బయట మాత్రం ఆ డబ్బు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. బంగారుబాతు లాంటి సింగరేణిని ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చింది” అని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలను దగా చేసిన్రు..
చేవెళ్ల డిక్లరేషన్ పేరిట సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎస్సీ, ఎస్టీలకు ఎన్నో హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక ధోకా ఇచ్చారని హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పామై కాటేస్తున్నదని విమర్శించారు. ఎన్నికలకు ముందు చేతులు జోడించారని, అధికారంలోకి వచ్చాక లంబాడీల చేతులకు బేడీలు వేశారని ఆరోపించారు. భూములు గుంజుకోవద్దు అంటే ఆడవాళ్లు, గర్భిణులు అని కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించారని, 45 మంది లంబాడి బిడ్డలను జైల్లో పెట్టారని మండిపడ్డారు.
చేవెళ్ల డిక్లరేషన్ లో చెప్పిన ఒక్కటీ అమలు కాలేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మోసం చేశారన్నారు. 50 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములు లాక్కున్నరని ఆరోపించారు. కొడంగల్ లంబాడి బిడ్డలు.. రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడతారని పేర్కొన్నారు. కాగా, జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. రైతుల కష్టాలు చూడలేక ఒక మాట మాట్లాడితే.. తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఏ ఒక్క డిక్లరేషన్‌నూ అమలు చేయలేదు
ముషీరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గిరిజనులకు ఇచ్చిన 12 హామీల సాధనకై లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌లతో కలిసి హరీశ్రావు మాట్లాడారు.
డిక్లరేషన్ అమలు చేయకుంటే ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వం గిరిజనుల భూములు గుంజుకుని, లంబాడి బిడ్డలకు బేడీలు వేసిందని మండిపడ్డారు.
గత కేసీఆర్ ప్రభుత్వం 3146 తండాలను పంచాయతీలుగా మార్చి, రిజర్వేషన్లు పెంచి, పోడు భూములకు పట్టాలిచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పాలనలో కల్యాణ లక్ష్మి రావడం లేదని, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదని, కార్పొరేషన్ సాయం అందడం లేదని ఆరోపించారు.
ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్ అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, ఇప్పటికే అనేక హామీలను అమలు చేశారని పేర్కొన్నారు.
