రైతులకు గుడ్ న్యూస్.. క్రాప్ లోన్​ కట్టినోళ్లకు క్యాష్​ ఇవ్వండి

 రైతులకు గుడ్ న్యూస్.. క్రాప్ లోన్​ కట్టినోళ్లకు క్యాష్​ ఇవ్వండి
  • పర్సనల్, హోమ్ లోన్స్​కు మాఫీ పైసలు జమ చేయొద్దు
  • నెలలో ప్రక్రియ పూర్తి చేయాలి
  • మాఫీ, రెన్యూవల్ తీరు పరిశీలనకు టాస్క్ ఫోర్స్
  • రెండుసార్లు రుణమాఫీ అమలు చేసిన సీఎం కేసీఆరేనని వ్యాఖ్య

హైదరాబాద్​, వెలుగు: ఇప్పటికే క్రాప్​లోన్లు కట్టిన రైతులకు రుణమాఫీ డబ్బులను వారి చేతికే ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు బ్యాంకర్లకు సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో పర్సనల్, హౌసింగ్ వంటి అవుట్ స్టాండింగ్ లోన్లు ఉండొచ్చని, అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను పాత అప్పు కింద జమ చేయకుండా నేరుగా ఇవ్వాలన్నారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి రుణమాఫీ డబ్బులు అందాయన్న సంతోషం రైతుల్లో ఉండాలన్నారు.

బేగంపేటలోని ఓ హోటల్ లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్​ఎల్​బీసీ)లో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఎలాంటి నిబంధనలు లేకుండా రెండు సార్లు రుణమాఫీ అమలు చేసిన సీఎం కేసీఆరేనన్నారు. ఇతర రాష్ట్రాలు రుణమాఫీ చేసినా అనేక రూల్స్​ పెట్టాయన్నారు. మొదటి దఫాలో 35 లక్షల మందికి రూ.16,144 కోట్లు రుణమాఫీ చేశామని, రెండో దఫాలో ఇప్పటివరకు రూ.99,999 రుణాలు కలిగిన 16 లక్షల 66 వేల మంది రైతులకు రూ. 8,098 కోట్లు రుణాలు క్లియర్​ చేశామన్నారు.

కొందరు రైతులకు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయని, కోఆపరేటివ్, జాతీయ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారికి రెండు ఖాతాల్లోకి కొంత మొత్తం చేరేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని బ్యాంకర్లకు సూచించారు. రుణమాఫీ, రెన్యూవల్ తీరును పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, అందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ ప్రతినిధులు ఉంటారన్నారు.

కొన్ని బ్యాంకులు విడతలవారీగా రెండు, మూడు నెలలు రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాయని, ఈసారి బ్యాంకర్లు కొంచెం శ్రమ తీసుకొని నెల రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థికంగా భారమైనా రైతుల కోసం సీఎం కేసీఆర్ రుణమాఫీని చేపట్టారన్నారు. సమావేశంలో స్పెషల్​ సీఎస్ రామకృష్ణారావు, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, లీడ్ బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.