టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గుడివాడపై మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తన తండ్రి , లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ( ANR ) పేరు మీద ఉన్న కళాశాలకు భారీ విరాళం ప్రకటించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జరిగిన ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలేజీ అభివృద్ధికి తన వంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రూ. 2 కోట్ల విరాళం..
ఈ వజ్రోత్సవాల వేళ కళాశాల నూతన భవనాన్ని నాగార్జున ప్రారంభించి.. తన తండ్రి, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్)కు నివాళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. తన తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థుల స్కాలర్‌షిప్పుల కోసం రూ. 2 కోట్ల విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నాగ్ భావోద్వేగానికి గురవుతూ.. మా నాన్నగారికి చదువుకునే అవకాశం లేకపోయినా, విద్యపై ఆయనకు అపారమైన గౌరవం ఉండేది. తాను చదువుకోలేకపోయినా, వేల మందికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని ఆయన కలలు కనేవారు. 1959లోనే ఆయన ఈ కాలేజీకి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ విరాళం ఇస్తున్నాను అని తెలిపారు.
ఏఎన్నార్ కళాశాల చరిత్ర
1950లో స్థాపించబడిన ఈ కళాశాల గుడివాడ ప్రాంతంలో ఎంతో మంది మేధావులను తయారుచేసింది. కేవలం చదువు మాత్రమే కాదు, సామాజిక బాధ్యతలోనూ ఈ సంస్థ ముందుంటోంది. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సంర్భంగా వజ్రోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని నాగసుశీల, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. కింగ్ రాకతో గుడివాడలో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరోను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
A gesture that speaks volumes. 🙏
— Ramesh Bala (@rameshlaus) December 17, 2025
King @iamnagarjuna announces a ₹2 CRORE donation to Gudivada ANR College on behalf of the Akkineni family continuing a legacy of gratitude, giving, and greatness. ❤️🔥#ANRLivesOn #NagarjunaAkkineni #AkkineniFamily pic.twitter.com/C7y0XfwgIc
