రేవంత్‌‌ది దండుపాళ్యం ముఠా : హరీశ్ రావు

రేవంత్‌‌ది దండుపాళ్యం ముఠా : హరీశ్ రావు
  •     సింగరేణి టెండర్లపై సీఎం, భట్టి, వెంకట్‌ రెడ్డి మధ్య పంచాయితీ: హరీశ్​ రావు
  •     దేశంలో కాంట్రాక్ట్​ సైట్​ విజిట్​ పద్ధతే లేదు.. రేవంత్ తీసుకొచ్చిండు
  •     ఆ విధానం వచ్చాక లబ్ధి పొందింది సీఎం బామ్మర్ది సుజన్‌‌ రెడ్డేనని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: కేబినెట్ దండుపాళ్యం ముఠా అంటే తన మీద పడ్డారని, ఇది వంద శాతం దండుపాళ్యం ముఠానేనని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు మండిపడ్డారు. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం రేవంత్‌‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తున్నదని ఆరోపించారు. 

మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులు బలి పశువులయ్యారన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘గతంలో దక్కన్ సిమెంట్స్ యజమానిని సీఎం ఇంటి ఎదురుగా ఉన్న గెస్ట్ హౌస్‌‌లో తుపాకీ ఎక్కుపెట్టి పైసలు వసూలు చేశారని మంత్రి కుమార్తె చెప్పింది. సీఎంకు అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి అని కూడా చెప్పారు. వ్యాపారవేత్తలను బెదిరించి సంపాదించుకున్న డబ్బు పంచుకోవడంలో పంచాయితీ వచ్చింది. సమ్మక్క సారక్క టెండర్లు దక్కలేదని.. టెండర్లు దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్ బీకి మార్చి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి దక్కించుకున్నరు. 

మద్యం హాలోగ్రామ్​ టెండర్ల విషయంలో సీఎం, ఎక్సైజ్ మంత్రి మధ్య ఐఏఎస్ బలైండు. సినిమా టికెట్ల పెంపు విషయంలో తన సంతకం పెట్టక ముందే జీవోలు వస్తున్నాయని వెంకట్​ రెడ్డి అన్నరు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ రూ.8 కోట్ల కోసం కాంట్రాక్టర్‌‌‌‌నే బెదిరించిండు. కాంట్రాక్టరే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఇన్ని పంచాయితీల్లో ఉన్న కేబినెట్​ దండుపాళ్యం ముఠా కాదా’’ అని ప్రశ్నించారు. 

కాంట్రాక్ట్‌‌ సైట్‌‌ విజిట్‌‌ ఎక్కడా లేదు

అసలు కాంట్రాక్ట్​ సైట్​ విజిట్​ పద్ధతి మైనింగ్‌‌లో ఎక్కడా లేదని హరీశ్​ రావు చెప్పారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 2024లో సైట్ విజిట్ విధానం తెచ్చిందని, అందులో మొదటి లబ్ధిదారులు రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డి అని ఆరోపించారు. ఆయన కంపెనీ శోధా కన్​స్ట్రక్షన్​కే ఈ సర్టిఫికెట్ వచ్చాక మొదటి టెండర్ దక్కిందన్నారు. గతంలో సింగరేణి మైనస్ 7, మైనస్ 8, మైనస్ 10, మైనస్ 20 వరకు టెండర్లు జరుగుతుండేవని గుర్తు చేశారు. రేవంత్​ కొత్త విధానం తెచ్చాక అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయన్నారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం నైనీ టెండర్ల నోటిఫికేషన్​ మాత్రమే రద్దు చేస్తామన్నారని, మరి మిగతావాటి సంగతేంటని ప్రశ్నించారు. ‘‘ఆన్ లైన్ టెండర్ల ద్వారా దేశంలో ఎవరైనా వేయొచ్చు. కానీ సైట్ విజిట్ విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంటే ఈ విధానంలో ఎవరు టెండర్ వేస్తున్నారో ముందుగానే తెలుసుకొని, బెదిరించి, భయపెట్టి వారికి టెండర్ దక్కకుండా చేసి తమకు కావాల్సినవాళ్లకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టారు. నైనీ బ్లాక్‌‌లో ఇదే జరిగింది. వాటాల పంచాయితీ వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చింది’’ అని హరీశ్‌‌ పేర్కొన్నారు.

డీజిల్​నూ కాంట్రాక్టర్లకే అప్పగించిన్రు

రేవంత్​ సర్కారు డీజిల్​ సరఫరాను కూడా కాంట్రాక్టర్లకే అప్పగించిందని హరీశ్​ మండిపడ్డారు. గతంలో సింగరేణి సంస్థ ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్‌‌ నుంచి బల్క్‌‌లో డీజిల్‌‌ను కొనుగోలు చేసేదని, ఇప్పుడు దానిని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అందుకు ఓ గ్యాంగ్​ లీడర్​ను సీఎం నియమించారని, ఎవరికి సర్టిఫికెట్ రావాలన్నా, టెండర్ రావాలన్నా ఆ గ్యాంగ్​ లీడర్​ ఆదేశం లేనిదే దక్కదన్నారు. సీఎంకు నిజంగా నిజాయతీ, దమ్ము ఉంటే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, అన్ని ఆధారాలూ తాను ఇస్తానని హరీశ్​ సవాల్​ విసిరారు.