రాష్ట్రంలో రాజ్యాంగం ఖూనీ.. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్రు: మాజీ మంత్రి హరీశ్ రావు

రాష్ట్రంలో రాజ్యాంగం ఖూనీ.. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్రు: మాజీ మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావుతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణలో రాజ్యాంగం ఖూనీ అవుతోందన్నారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి ఇక్కడి ఘటనలు కనిపించవా అని ప్రశ్నించారు. మెదక్‌‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, ఓ ముస్లిం మహిళను బెదిరించారని అన్నారు. 

ఈ ఘటనకు సంబంధం లేని ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి, గాయాలు కాకముందే మెడికల్ రిపోర్ట్ రాకుండానే 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం, మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు.