- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
జహీరాబాద్, వెలుగు: పార్టీ గుర్తుతో స్థానిక ఎన్నికలు జరిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జంకుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బుధవారం జహీరాబాద్ లోని ఓ కల్యాణ మండపంలో కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కారు గుర్తుకు సీఎం రేవంత్ రెడ్డి జంకుతున్నారని అందుకే పార్టీ గుర్తులతో స్థానిక ఎన్నికలు జరిపేందుకు కాలయాపన చేస్తున్నారన్నారు.
పార్టీ గుర్తులు లేకుండానే జహీరాబాద్ నియోజకవర్గంలో 55 మంది సర్పంచులు గెలవడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుతో పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలుస్తామన్నారు. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. జహీరాబాద్, కోహిర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో తాను ఇక్కడే ఉండి రెండు మునిసిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా కృషి చేస్తానన్నారు.
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని సీఎంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం పాల్గొన్నారు.
సిద్దిపేట పదిలో ఫస్ట్ రావాలి
సిద్దిపేట రూరల్: సిద్దిపేట పదిలో ఫస్ట్ రావాలని, మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు పిల్లలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి చదివించాలని హరీశ్ రావు సూచించారు. విద్యార్థుల తల్లి తండ్రులకు బుధవారం ఆయన పలు సూచనలు చేస్తూ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో వార్షిక పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై దృష్టి పెట్టాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడాలని సూచించారు.
నాలుగేళ్లుగా మన సిద్దిపేట పదో తరగతి విద్యార్థులంతా అత్యధిక మార్కులు సాధిస్తున్నారని, బాసర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలోనూ 169 మంది సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు గతేడాది సీట్లు సాధించడం గర్వకారణమన్నారు.
