
‘సీఎం కేసీఆర్ సారు వస్తుండు.. ఊళ్లె సభ పెట్టినం.. తప్పక రా.. భోజనాలుగీజనాలు అన్నీ ఆడ్నే..’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చింతమడకకు చెందిన జిట్టని పోశవ్వ అనే వృద్ధురాలిని స్వయంగా ఆహ్వానించారు. సీఎం పర్యటన కోసం కొద్దిరోజులుగా అధికారులతో కలిసి అక్కడే ఉన్న హరీశ్ , ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి ఇల్లిల్లూ తిరుగుతూ అందరినీ పిలవడంతోపాటు మామిడి ఆకులతోర ణాలు, పూలదండలు కట్టించారు.
రెయిన్ ప్రూఫ్ తో కూడిన సభావేదికకు పలుచోట్ల మార్పులు చేర్పులు చేయించారు హరీష్. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం పక్కన చింతచెట్టు కింద గ్రామస్థులతో కలిసి సీఎం సహఫంక్తి భోజనం చేయనుండగా ఏర్పాట్లను హరీశ్ రావు పరిశీలించారు. భోజనాల కోసం వివిధ రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు.