హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు

హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు
  •  పీఏ నరేశ్ కుమార్ సహా నలుగురు అరెస్టు 

జూబ్లీహిల్స్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు పీఏల్లో ఒకరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అక్రమంగా డ్రా చేసుకొని డబ్బులు కాజేశాడు. ఈ స్కామ్​లో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్ రావు వద్ద పీఏగా పని చేసిన కె.నరేశ్ కుమార్ ఈ వ్యవహారం మొత్తం నడిపించినట్టు పోలీసులు చెబుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలకు ట్రీట్​మెంట్ తీసుకొని సాయం కోసం వచ్చిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్​నుంచి హరీశ్ రావు నిధులు మంజూరు చేయించేవారు. 

హరీశ్ వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారాలు చూసే నరేశ్ కుమార్ వాటిని మార్చుకొని సొమ్ము చేసుకునేందుకు కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేశ్ గౌడ్​తో కలిసి ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఇతరులకు మంజూరైన చెక్కులను డ్రా చేసేందుకు సేమ్​నేమ్​తో ఉన్న వారి అకౌంట్ల వివరాలు ఇచ్చే బాధ్యతను ఓంకార్ అనే వ్యక్తికి అప్పజెప్పాడు. వీళ్లందరి సాయంతో మొత్తం 17 చెక్కులను డ్రా చేసి డబ్బులు కాజేశాడు. 

ఇట్ల బయటపడ్డది.. 

మెదక్ పీర్ల తండా అబెండకు చెందిన పి.రవినాయక్ భార్య లలితాబాయిని 2022 నవంబర్​లో పాము కరిచింది. సంగారెడ్డిలోని బాలాజీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం అమీర్​పేటలోని వెల్​నెస్​ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ట్రీట్​మెంట్​పొందుతూ ఆమె చనిపోయింది. చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు పెట్టిన రవినాయక్..  సీఎం రిలీఫ్ ఫండ్​కోసం హరీశ్ రావుకు దరఖాస్తు చేసుకున్నాడు. 

దాని స్టేటస్​పై సెక్రటేరియెట్​లో ఎంక్వైరీ చేయగా రూ.87,500 మంజూరు అయినట్టు.. 707447, 707487 నంబర్ల చెక్కులను హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​పరిధిలో మార్చినట్టు తెలిసింది. తనకు మంజూరైన చెక్కును ఎవరో మార్చుకొని డబ్బులు తీసుకున్నారని రవినాయక్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంక్వైరీ చేసిన పోలీసులు నరేశ్ కుమార్, వెంకటేశ్ గౌడ్, వంశీ, ఓంకార్ ను అరెస్టు చేశారు.