సిద్దిపేట, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డికి సిద్దిపేటపై ఈర్ష్యా ద్వేషాలెందుకని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో హరీశ్‌రావు మంగళవారం ఆయనకు బహిరంగ లెటర్ రాశారు. సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకొని ఎట్లా ఇక్కడికి వస్తున్నాడని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట అభివృద్ధికి విడుదల చేసిన రూ.1,070 కోట్లను ఎందుకు రద్దు చేశాడో సీఎం చెప్పాలని, వాటిని తిరిగి విడుదల చేశాకే ఇక్కడ అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట అభివృద్ధిపై ప్రతిపక్ష లీడర్‌గా ఆనాడు తాను చేసిన విమర్శలను, ఇక్కడి ప్రజలు మరిచిపోలేదన్నారు. నర్మెటలో ఈనెల 22న ప్రారంభించనున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీఆర్‌ఎస్ హయాంలోనే నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో మంజూరై, మీ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని లెటర్‌లో డిమాండ్ చేశారు.
