విద్యా కమిషన్‌ లో అసలైన విద్యావేత్తలేరీ? : హరీశ్ రావు

విద్యా కమిషన్‌ లో అసలైన విద్యావేత్తలేరీ? : హరీశ్ రావు
  • ఎడ్యుకేషన్‌లో పీహెచ్​డీ చేసినోళ్లు ఆ కమిటీలో ఒక్కరైనా ఉన్నారా?: హరీశ్ రావు 

హైదరాబాద్, వెలుగు: విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలే లేరని, అలాంటి వారితో విద్యావిధానంపై నివేదిక ఇప్పించడం సీఎం రేవంత్ రెడ్డి తీరుకు అద్దం పడుతున్నదని బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ విద్యా కమిషన్‌లో.. స్కూల్ పిల్లలకు గానీ, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఎవరో చెప్పగలరా అని శుక్రవారం ‘ఎక్స్​’ ప్రశ్నించారు. 

జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లు మినహా.. అసలు ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన వాళ్లుగానీ, స్కూల్ సిలబస్ తయారీలో, కోర్ సైన్స్ సబ్జెక్టుల్లో పట్టున్న వాళ్లు కానీ ఈ కమిటీలో ఉన్నారా అని నిలదీశారు. ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని, ఆయనో ఇంజనీర్ అని చెప్పారు. 

‘‘ఆఫీసులు నడపడం వేరు.. చదువులు చెప్పడం వేరు. పరిపాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన.. పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్టా? తెలంగాణ విద్యా భవిష్యత్తును మార్చేంత అర్హత, నైపుణ్యం ఈ కమిటీకి ఉందని రేవంత్ నిజంగానే నమ్ముతున్నారా? విద్యావేత్తలు, అనుభవం ఉన్న టీచర్లు, చైల్డ్ సైకాలజిస్టులు, సబ్జెక్ట్ నిపుణులు లేకుండానే రాష్ట్రానికి కొత్త విద్యా విధానాన్ని తయారు చేయొచ్చనే ఆలోచన.. విద్యా మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌కే దక్కుతుంది’’ అని విమర్శించారు.