చెప్పింది కొండంత.. ఇచ్చింది గోరంత .. అన్ని వర్గాలను మోసం చేశారు: హరీశ్

చెప్పింది కొండంత.. ఇచ్చింది గోరంత ..  అన్ని వర్గాలను మోసం చేశారు: హరీశ్

 

  • హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నరు 
  • పంటలకు బోనస్, రుణమాఫీ, 
  • నిరుద్యోగ భృతికి కేటాయింపులేవీ? 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘కొండంత ఆశలు.. గోరంత అమలు’ అన్నట్టుగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో చెప్పింది చాంతడంత, కానీ బడ్జెట్​లో ఇచ్చింది చెంచడంత అని కామెంట్ చేశారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకు మొదటి అడుగు పడిందని, దానికి బడ్జెట్ అద్దం పడుతున్నదని అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్ రావు మాట్లాడారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ‘‘బడ్జెట్ రైతుల నోట్లో మట్టి కొట్టేలా ఉంది. రైతుబంధుకు రాంరాం.. రుణమాఫీ వాదన వద్దు..  పంటలకు బోనస్ బోగస్ అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి మొత్తం రూ.19,746 కోట్లు కేటాయించారు. కానీ ఇందులో ఎస్టాబ్లిష్​మెంట్ వంటి వాటికే 3 వేల కోట్లు ఖర్చయితే.. మిగిలిన రూ.16 వేల కోట్లతో రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ వంటివి ఎలా అమలు చేస్తారు? ఒక్క రైతు భరోసాకే రూ.22 వేల కోట్లు కావాలి. ఇక రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్​లో నాలుగు రూపాయలు కూడా కేటాయించలేదు” అని ఫైర్ అయ్యారు. ‘‘రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం అబద్ధం చెబుతున్నది. 24 గంటల కరెంట్ వస్తున్నదో? లేదో? ఎక్కడికైనా వెళ్లి చూద్దాం.. సీఎం వస్తారా? మంత్రి వస్తారా?” అని సవాల్ విసిరారు. 

ఆరు గ్యారంటీలపై చట్టమేదీ? 

బడ్జెట్.. మిలీనియం జోక్​అని హరీశ్ విమర్శించారు. ‘‘ఆరు గ్యారంటీల అమలు కోసం చట్టం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చేయలేదు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ అది బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. హామీలు అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది” అని మండిపడ్డారు. ‘‘ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు అనేది కొత్తదేం కాదు. పింఛన్లు ఎగ్గొట్టి మోసం చేస్తున్నారు. దీనిపై అసెంబ్లీలో అడిగితే సీఎం నోరు మెదపలేదు. పెన్షన్లు రూ.4 వేలకు పెంచకపోగా, ఇయ్యాల్సిన పింఛన్లు కూడా ఇయ్యలేదు. జనవరి, ఫిబ్రవరి పింఛన్లు ఇంకా చాలా మందికి రాలేదు” అని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించలేదని.. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ చెల్లింపులకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ‘‘మహాలక్ష్మి పథకం అమలుకు రూ.45 వేల కోట్లు కావాలి. అసలు ఈ స్కీమ్ కు ఎంత కేటాయించారు? గృహజ్యోతి పథకానికి రూ.2,400 కోట్లే కేటాయించారు. కానీ 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకం వర్తింపజేయాలంటే రూ.8వేల కోట్లు కావాలి. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టిస్తామన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు అంటే రూ.20,800 కోట్లు కావాలి. కానీ కేటాయింపులు మాత్రం రూ.7వేల కోట్లే” అని ఫైర్ అయ్యారు. బడ్జెట్ లో ఆటోడ్రైవర్ల ప్రస్తావనే లేదని.. వాళ్లను ఆదుకోవాలని కోరారు.  

మీరెందుకు అప్పులు తెస్తున్నరు? 

బీఆర్ఎస్ భారీగా అప్పులు తెచ్చిందని గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు బడ్జెట్ లో రూ.54 వేల కోట్ల అప్పులు తెస్తామని ఎలా పేర్కొన్నదని హరీశ్ ప్రశ్నించారు. ‘‘మాకంటే రూ.19 వేల కోట్లు అదనంగా కాంగ్రెసోళ్లు అప్పు తెస్తున్నారు. ఇన్ని రోజులు మేం అప్పులు చేశామన్నారు. ఇప్పుడు వాళ్లూ అప్పులు తెస్తున్నారు. నేతి బీరలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ మాటల్లో నిజం అంత ఉంది” అని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉంటే.. రూ.59 వేల కోట్లు అదనంగా రాబడి వస్తదని బడ్జెట్ లో పేర్కొన్నారు. అది ఎక్కడి నుంచి వస్తది? ప్రజలపై పన్నుల వేస్తారా?” అని ప్రశ్నించారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామంటూ నిండు సభలో సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పే, అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు.