- సీఎం బామ్మర్ది బొగ్గు స్కామ్‌ను మేం బయటపెట్టినందుకే ‘సిట్టు, లట్టు, పొట్టు’ అంటూ వేధింపులు
- కోర్టులు కొట్టేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వం సీరియళ్లు నడుపుతున్నది
- రెండేండ్ల నుంచి ఈ కేసులో ఏం తేల్చలేదుబిడ్డా.. నువ్వెన్ని నోటీసులు పంపినా
- నిన్ను విడిచేది లేదని సీఎం రేవంత్‌పై ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పంపిన సిట్ నోటీస్ అంతా ట్రాష్ అని, అన్నీ నిరాధార ఆరోపణలు.. అడిగిందే అడుగుడు..సొల్లు పురాణం తప్ప ఇంకేమీ లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. విచారణలో గంట సేపు ప్రశ్నలు అడగ్గానే బయటి నుంచి ఫోన్లు వస్తున్నాయని, మళ్లీ ఓ గంట తర్వాత వచ్చి మళ్లీ అవే ప్రశ్నలు తిప్పి తిప్పి అడిగారని పేర్కొన్నారు.ఫోన్లు రేవంత్ చేసిండో.. సజ్జనార్ చేసిండోగానీ కొత్తగా ఏమీ లేదని తెలిపారు. రేవంత్ బామ్మర్ది సుజన్‌రెడ్డి బొగ్గు బాగోతం బయటపెట్టినందుకే తనకు నోటీసులిచ్చారని, బొగ్గు టెండర్ల వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే ‘సిట్టు..లట్టు..పొట్టు’ అంటూ వేధిస్తున్నారని విమర్శించారు. ఎన్ని సిట్లు వేసుకున్నా భయపడేది లేదన్నారు. మంగళవారం హరీశ్‌రావు సిట్ విచారణకు హాజరైన తర్వాత, అంతకుముందు తెలంగాణ భవన్, ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. ఆయన తప్పు చేయకుంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘సింగరేణి టెండర్ల వ్యవహారంలో మీ బామ్మర్దే మొదటి దోషి. అందుకు అన్ని ఆధారాలూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నం. మీ బామ్మర్దే రింగ్కింగ్. ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య కొట్లాటతో అది బయటపడింది. ధైర్యం ఉంటే ఈ వ్యవహారంపై విచారణ జరిపించు. రేవంత్.. నువ్వు ఎన్ని సిట్లు వేసుకున్నా మాకేం భయం లేదు. ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టులు మాకు కొత్తకాదు. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన సైనికులం. సిట్ నోటీసులు రాగానే.. కాంగ్రెస్ నాయకుల్లాగా పారిపోయే వాళ్లం కాదు. మీరిచ్చే నోటీసులు నా ప్రజాపోరాటానికి దక్కిన గౌరవంగానే భావిస్తాను’’ అని వ్యాఖ్యానించారు.
కోర్టులు కొట్టేసిన కేసులపై సీరియళ్లు
సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులపై ప్రభుత్వం సిట్ అంటూ సీరియళ్లు నడుపుతున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ కేసులో రెండేండ్లుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ‘‘రుణమాఫీ ఏది అంటే.. యాదాద్రిలో కేసు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే.. మానకొండూరులో కేసు..ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే ఖమ్మంలో కేసు పెట్టినవు. ఇప్పుడు మీ బామ్మర్ది కుంభకోణం బయటపెట్టినమని సిట్ నోటీసులిచ్చినవ్. బిడ్డా.. నువ్వు ఎన్ని నోటీసులు పంపినా.. ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు. నువ్వెన్ని కుట్రలు చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. నువ్వు ఎన్ని గిమ్మిక్కులు చేసినా నిన్ను వదిలిపెట్టం. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటం’’ అని పేర్కొన్నారు. పోలీసుల వెనుక దాక్కుని పిరికిపందలా నోటీసులు పంపడం కాదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. సిట్ నోటీసులకు సమాధానాలు ఇచ్చేందుకు తానెప్పుడూ సిద్ధమేనని, రేపు ప్రజాకోర్టులో సమాధానం చెప్పేందుకు రేవంత్ సిద్ధంగా ఉండాలని సూచించారు. సిట్ విచారణ రికార్డు మొత్తాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రెండేండ్లలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు రేవంత్ బామ్మర్ది బొగ్గు కుంభకోణం, అవినీతిపై విచారణ జరిపించి అంతా కక్కిస్తామని అన్నారు.
బొగ్గు స్కామ్‌పై కిషన్‌రెడ్డి సీబీఐతో విచారణ జరిపించాలి
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, అది నిజం కాకుంటే బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దీనిపై కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నైనీ బ్లాక్ టెండర్ ఒక్కటే కాకుండా.. అన్ని టెండర్లనూ రద్దు చేయాలన్నా రు. దీనిపై బీజేపీ వెంటనే స్పందించి.. దొంగలను అరెస్ట్ చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేశారు. సింగరేణి డబ్బుతో రేవంత్ ఫుట్‌బాల్ ఆడుతున్నాడన్నారు. సోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటూ కొత్త నిబంధన చేర్చారని లేఖలో పేర్కొన్నారు. ఇటు అధిక ధరలకూ కాంట్రాక్టులు అప్పగిస్తున్నారన్నారు. డీజిల్ కొనుగోలు విధానాన్ని కాంట్రాక్టర్లకు బదిలీ చేశారని చెప్పారు. ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా సింగరేణిలోని కేంద్ర డైరెక్టర్లు మౌనంగా ఉంటున్నారని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని పేర్కొన్నారు.
