రాహుల్ లీడర్ కాదు.. రీడర్: హరీశ్ రావు

రాహుల్ లీడర్ కాదు.. రీడర్: హరీశ్ రావు
  • రేవంత్​ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలు చదివి పోతున్నరు: హరీశ్‌‌రావు
  • కాంగ్రెస్సోళ్లు తెలంగాణకు బంధువులు కాదు.. రాబంధులని ఫైర్‌‌‌‌
  • ఆరు గ్యారంటీలు ఏ హోదాలో అమలు చేస్తారని ప్రశ్న 

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు అనగానే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నేతలు వచ్చి వాలుతున్నారని, వాళ్లు తెలంగాణకు బంధువులు కాదని, ప్రజలను పీడించే రాబంధులని మంత్రి హరీశ్‌‌ రావు ఫైర్‌‌‌‌ అయ్యారు. పీసీసీ చీఫ్‌‌ రేవంత్ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలనే వాళ్లు చదివిపోతున్నారని, అందుకే రాహుల్ గాంధీ లీడర్ కాదు.. జస్ట్ రీడర్ అంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ గెలిస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామ‌‌ని ఏ హోదాలో రాహుల్ గాంధీ అంటున్నారో చెప్పాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖ‌‌ర్గేనా? రాహులా? ప్రియాంక‌‌నా? అంటూ విమర్శించారు. ములుగు, మంథనితో పాటు తెలంగాణలో ఏ సెగ్మెంట్‌‌కు పోయినా అభివృద్ధి కనిపిస్తోందని చెప్పారు. కర్నాటకలో 5 గ్యారంటీలు అమలు చేశామని రాహుల్ అంటున్నారని, మరి, రైతులకు 7 గంటల కరెంటు ఇస్తామని చెప్పి, 5 గంటల కూడా ఇస్తలేరని ఆరోపించారు. ఇక్కడ కూడా రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి అన‌‌లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌కు అధికారం ఇస్తే దొంగ రాత్రి కరెంటు మొద‌‌ల‌‌వుతుందని, పాము, తేలుకాట్లకు రైతులు గురయ్యే పరిస్థితి వస్తుందన్నారు. కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ అంటే, ప్రాణం పోయినా పెట్టబోమని సీఎం కేసీఆర్ కేంద్రానికి స్పష్టం చేశారన్నారు. చత్తీస్‌‌గఢ్‌‌లో ధాన్యాన్ని ఎంఎస్పీకి కొంటున్నామని రాహుల్ డబ్బా కొట్టుకుంటున్నారని, ఎకరానికి 15 క్వింటాళ్లు మాత్రమే అలా కొంటున్నారని తెలిపారు. 

అప్పుడెందుకు తెలంగాణ ఇవ్వలే..

ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, 2004లో తెలంగాణ ఇస్తామని కేసీఆర్‌‌‌‌కు హామీ ఇచ్చి తమతో పొత్తు పెట్టుకున్నారని, మరి అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారా అని హరీశ్‌‌రావు ప్రశ్నించారు. దేశ స్వాతంత్రం కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసినోళ్లదేమీ లేదు కానీ.. ఇచ్చిన బ్రిటీషోళ్లు గొప్పోళ్లని రాహుల్ గాంధీ చెబుతున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణను హెల్త్ హబ్‌‌గా తీర్చిదిద్దారన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌‌ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి ఉండి కూడా పోడు, అసైన్డ్ భూముల లొల్లి ఎందుకు పరిష్కారం చేయలేదని ప్రశ్నించారు. దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్‌‌కు అప్పుడు మన సమ్మక్క సారాలమ్మ జాతర కనిపించలేదని, ఇప్పుడు జాతీయ పండుగ అంటున్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరూ దొంగలేనని, తెలంగాణ ద్రోహులేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదన్నారు. తెలంగాణ ప్రజలే తమకు హైకమాండ్ అని, రాష్ట్ర అభివృద్ధే ఎజెండా అని వివరించారు.