
2001లో TRS స్థాపించిన నాడు పార్టీ కార్యాలయం ఎక్కడ పెట్టుకోవాలన్నా వీలు లేని పరిస్థితి ఉండేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జలదృశ్యంలో పార్టీ కార్యాలయం పెట్టుకుంటే నాటి పాలకులు బలవంతంగా తొలగించారన్నారు. తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకోవడమే కాక.. రాజధానిలో అద్భుతమైన పార్టీ కార్యాలయం నిర్మించుకున్నామన్నారు. ఇప్పుడు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటున్నందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు గర్వపడాలన్నారు.
జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలకు.. పార్టీ ఆఫీస్ ఒక వేదికగా ఉంటుందన్నారు హరీష్ రావు. ఎకరం స్థలంలో పక్కా వాస్తు ప్రకారం దసరా నాటికి భవనాన్ని నిర్మించుకొని ప్రారంభించుకుంటామని అన్నారు. బిల్డింగ్ నిర్మాణానికి త్వరలోనే ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తామన్నారు. వారి ఆధ్వర్యంలో వేగంగా అద్భుతమైన భవనం నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏకకాలంలో 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు హరీష్ రావు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులు స్వచ్చందంగా విరాళాలు ఇవ్వాలని కోరారు.
పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఒక నెల వేతనం
పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సతీష్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కార్పొరేషన్ చైర్మన్లు శ్రీనువాస్ రెడ్డి, బాలమల్లు, జడ్పీ చైర్ పర్సన్ లు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకరించారు. వీరితో పాటు పలువురు నాయకులు విరాళాలు ప్రకటించారు.