- ఓట్ల కోసమే సీఎం రేవంత్ అబద్ధపు హామీలు: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని బుధవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి.. అన్నంపెట్టే రైతన్నకు రైతుభరోసా ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయని విమర్శించారు. ఎన్నికల కోడ్ ముగిసినా ఊసే ఎత్తట్లేదని మండిపడ్డారు.
పార్కులు కట్టేందుకు వేల కోట్లా..
"కాంగ్రెస్ ప్రభుత్వం.. ఓట్ల కోసమే రైతు భరోసా పేరుతో నాటకాలు ఆడిందని బట్టబయలైంది.మూసీలో పార్కులు కట్టడానికి వేలకోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఫోర్త్ సిటీ భూసేకరణకు, రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి వేల కోట్లు ఉంటాయి కానీ, కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుభరోసా ఇవ్వడానికి మాత్రం చేతులు రావా? అందాల పోటీలకు, ఫుట్ బాల్ మ్యాచ్ లకు వందల కోట్లు ఖర్చు పెడుతూ.. అన్నంపెట్టే రైతన్న నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారు’’ అని హరీశ్ విమర్శించారు.
